తెలంగాణలో మే 10న ఇంటర్ ఫలితాలు... మే 15న టెన్త్ రిజల్ట్స్!

  • మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు
  • ఏప్రిల్ 3 నుంచి 11 వరకు పదో తరగతి పరీక్షలు
  • వీలైనంత త్వరగా మూల్యాంకనం
  • వివిధ కోర్సుల ప్రవేశాలకు వీలుగా ఫలితాల వెల్లడికి సన్నాహాలు
తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగడం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న మొదలై ఏప్రిల్ 11తో ముగిశాయి. ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. 

అటు నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించింది. 

ఇక, తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యాబోధన ప్రారంభం కానుంది. అందుకోసం, టెన్త్ ఫలితాల వెల్లడి కోసం విద్యాశాఖ త్వరపడుతోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది.


More Telugu News