ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకెళ్తారు.. ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారు.. నారా లోకేశ్ ఎద్దేవా

  • వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న లోకేశ్
  • త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్య
  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర 
త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ‘‘ఇన్‌పుట్ సబ్సిడీ కట్.. గిట్టుబాటు ధర లేదు. రైతు రథాలు లేవు.. డ్రిప్ ఇరిగేషన్ లేదు. రైతులకు ఉచితంగా ఇస్తున్న కరెంట్ కూడా కట్ చేశారు’’ అని ఆరోపించారు. 

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. గుండ్లకొండ, గుడిమిర్ల, బుర్రుకుంటలో స్థానికులతో లోకేశ్ సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబును వద్దనుకుని.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అందరినీ ముద్దులు పెట్టుకుని తిరిగిన జగన్‌ను నమ్మి గెలిపించారు. పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’’ అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ అని లోకేశ్ విమర్శించారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారని.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని దుయ్యబట్టారు.


More Telugu News