ముఖంపై భారత పతాకం.. గోల్డెన్ టెంపుల్ లోకి ప్రవేశానికి నో!

  • బాలికను అడ్డుకున్న స్వర్ణ దేవాలయం సిబ్బంది
  • ‘ఇది భారత్ కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యలు
  • వైరల్ అయిన వీడియో
  • గురుద్వారా ప్రబంధక్ కమిటీ క్షమాపణలు
పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్)లోకి ప్రవేశించకుండా ఓ బాలికను అక్కడి నిర్వాహకులు అడ్డుకున్నారు. సదరు బాలిక తన ముఖంపై భారత జాతీయ పతాకాన్ని పెయిటింగ్ గా వేసుకుని గోల్డెన్ టెంపుల్ కి ప్రవేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. కాగా ఈ ఘటన పట్ల శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రటరీ క్షమాపణలు చెప్పారు. బాలిక ముఖంపై వేసుకున్నది త్రివర్ణ పతాకం కాదని స్పష్టం చేశారు.

‘‘ఇది సిక్కుల మందిరం. ప్రతీ మతంలోనూ ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి. మేము అందరినీ ఆహ్వానిస్తాం. అధికారులు తప్పుగా ప్రవర్తిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాం. బాలిక ముఖంపై ఉన్నది మన జాతీయ పతాకం కాదు. దానిపై అశోకుడి చక్రం లేదు. అది రాజకీయ పతాకం’’ అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్ గ్రెవాల్ ప్రకటించారు. 

గోల్డెన్ టెంపుల్ లోకి బాలిక వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ‘ఇది భారత్ కాదు, ఇది పంజాబ్’ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అట్టారి-వాఘా (భారత్-పాక్ సరిహద్దు) సరిహద్దు సైనిక కవాతు కార్యక్రమాన్ని చాలా మంది సందర్శిస్తుంటారు. ఆ సమయంలో త్రివర్ణ పతాకాలను పెయింటింగ్ గా వేయించుకుని, అటు నుంచి స్వర్ణ దేవాలయన్ని సందర్శిస్తుంటారు.


More Telugu News