శ్రీవారి దివ్యదర్శనం టోకెన్ల జారీలో మార్పులు.. ఎక్కడ ఇస్తారంటే..!

  • కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ అలర్ట్
  • భూదేవి కాంప్లెక్స్ లోనే దివ్య దర్శనం టోకెన్ల జారీ
  • 2083వ మెట్టు దగ్గర స్కానింగ్ చేస్తే స్లాటెడ్ దర్శనం
  • శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యథాప్రకారమే టోకెన్ల జారీ 
తిరుమలేశుడిని కాలినడకన దర్శించుకోవాలని వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ ప్రకటించింది. అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో కాలినడకన వెళ్లే భక్తులకు గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు అందించే వారు.. ప్రస్తుతం ఈ టోకెన్ల జారీ ప్రక్రియను భూదేవి కాంప్లెక్స్ కు మార్చినట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలని, ఆ టోకెన్ ను అలిపిరి ఫుట్ పాత్ 2083వ మెట్టు వద్ద స్కాన్ చేయాలని తెలిపింది. స్కాన్ చేశాకే స్లాటెడ్ దర్శనం కేటాయిస్తామని స్పష్టం చేసింది. 

భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ పొందిన భక్తులు అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుంటేనే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు జారీ చేసే టోకెన్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ పేర్కొంది. శ్రీవారి మెట్టు మార్గంలోని 1240వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లను భక్తులు తీసుకోవచ్చని తెలిపింది. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి చౌల్ట్రీల వద్ద స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను జారీ చేస్తారని వెల్లడించింది.


More Telugu News