కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలకు కీలక సూచన చేసిన రాహుల్

  • 224 స్థానాలకు గాను 150 సీట్లు గెలవాలన్న రాహుల్
  • లేకపోతే మన ఎమ్మెల్యేలను బీజేపీ దొంగిలిస్తుందని వ్యాఖ్య
  • బీజేపీ దగ్గర ఎంతో అవినీతి సొమ్ము ఉందని విమర్శ
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రచారపర్వం ఊపందుకుంది. అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నాయి. సర్వేలు కూడా ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని చెపుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. 213 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించిన పార్టీ అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుంది. 

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని తమ నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక హెచ్చరిక జారీ చేశారు. మనకు 113 సీట్లు సరిపోవని 150 స్థానాల్లో కచ్చితంగా గెలవాల్సిందేనని చెప్పారు. మనకు తక్కువ మెజార్టీ వస్తే మన ఎమ్మెల్యేలను అవినీతి పార్టీ బీజేపీ దొంగిలిస్తుందని అన్నారు. 150 స్థానాల్లో గెలిస్తేనే మనం సురక్షిత స్థానంలో ఉంటామని చెప్పారు. బీజేపీ అనేది ఒక అవినీతి సంస్థ అని, దాని వద్ద ఎంతో అవినీతి సొమ్ము ఉందని... మన ఎమ్మెల్యేలను కొనేందుకు, లోబరుచుకునేందుకు అవినీతి సొమ్ముని వినియోగిస్తుందని రాహుల్ చెప్పారు. అందుకే, 150 సీట్లు గెలిస్తే కానీ మనం అధికారాన్ని నిలబెట్టుకోలేమని చెపుతున్నానని అన్నారు. 

బీజేపీ, ఆరెస్సెస్ కుట్రలు, కుతంత్రాలు, విద్వేషాలు, హింస, దాడులను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని రాహుల్ సూచించారు. రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య ఐక్యత ఉండటం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. నేతల మధ్య ఐక్యతను తాను భారత్ జోడో యాత్రలో చూశానని అన్నారు.


More Telugu News