నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

  • కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో తనిఖీలు
  • అనుమానాస్పదంగా కనిపించిన కారు డ్రైవర్‌ను ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసు
  • ఢీకొట్టి వేగం పెంచిన కారు డ్రైవర్
  • నిందితుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తింపు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టిన కారు డ్రైవర్ అతడిని ఏకంగా 20 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో శనివారం తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో అటువైపుగా వస్తున్న ఓ కారు డ్రైవర్‌ను అనుమానించిన ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్ మాలిక్ (37) సహచర పోలీసుతో కలిసి ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. గమనించిన కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వారిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. దీంతో సిద్ధేశ్వర్ ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ కారును ఆపని డ్రైవర్ మరింత వేగం పెంచి పోనిచ్చాడు. దీంతో సిద్ధేశ్వర్ కారు బానెట్‌ను గట్టిగా పట్టుకుని కిందపడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. 

దాదాపు 20 కిలోమీటర్ల దూరం పోనిచ్చిన తర్వాత కారు డ్రైవర్ వేగం తగ్గించడంతో గవ్హాన్ ఫాటా ప్రాంతంలో సిద్ధేశ్వర్ కిందపడ్డాడు. అప్పటికే కారును వెంబడించిన పోలీసులు కిందపడిన సిద్ధేశ్వర్‌ను రక్షించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. ఆ తర్వాత అతడికి జరిపిన వైద్య పరీక్షల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తేలింది. హత్యాయత్నం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.


More Telugu News