చాటింగ్‌పై దర్యాప్తు కోరే దమ్ముందా కవిత అక్కా: సుఖేశ్

  • జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్
  • కవిత పట్ల గౌరవంతోనే అక్కా అంటున్నాని వెల్లడి
  • కేజ్రీవాల్ కు తిహార్ జైలు స్వాగతం పలుకుతుందన్నసుఖేశ్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితకు  సవాల్ విసురుతూ ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ విడుదల చేశాడు. మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్న సుఖేశ్‌ తాను విడుదల చేసిన వాట్సప్ చాటింగ్‌లపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు కోరే దమ్ముందా? అని లేఖలో ప్రశ్నించాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచన మేరకు కవితకు రూ. 15 కోట్లు ఇచ్చినట్టు సుఖేశ్ ఇటీవల చాటింగ్స్ బయటపెట్టాడు. అయితే, సుఖేశ్ ఎవరో తనకు తెలియదని కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సుఖేశ్‌ చంద్రశేఖర్‌ తన లాయర్ ద్వారా జైలు నుంచి మరో లేఖను విడుదల చేశాడు. తన మాతృభాష తమిళం, తెలుగుగా పేర్కొన్నాడు. కవిత పట్ల తనకు గౌరవం ఉందని, అందుకే ‘కవిత అక్క’ అని సంబోధిస్తానని వివరించాడు. 

‘చాట్‌లపై దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐని అడిగే దమ్ముందా? అవి నిజమా? కాదా? అన్నదాన్ని కోర్టులు, చట్టాలు నిర్ణయిస్తాయి. అందుకే నేను సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్‌ యాక్ట్‌)లోని సెక్షన్‌ 65బీ ప్రకారం అఫిడవిట్‌ ఇచ్చాను. దయచేసి, ఆ సెక్షన్‌ను ఒక్కసారి చదవండి కవిత అక్కా’ అని సుఖేశ్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు. కవిత, ఆమె అనుచరులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా తాను బయటపెట్టిన ఆధారాలు నిరూపితమవుతాయన్నాడు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైనా సుఖేశ్‌ తన లేఖలో విమర్శలు గుప్పించారు. తిహార్ జైలు ఆయనకు స్వాగతం పలుకుతుందన్నాడు. 

కవితకు రూ.15 కోట్లు పంపించిన తర్వాత ఆయనతో జరిగిన ఫేస్‌టైమ్‌ కాల్‌కు సంబంధించిన స్ర్కీన్‌ షాట్లను త్వరలో విడుదల చేస్తాను, సిద్ధంగా ఉండాలంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించానని, ప్రజలను ఓటు అడిగే ముందు నా మనస్సు, హృదయంలో నుంచి రహస్యాలు, భారాన్ని తొలగించుకొని స్వచ్ఛంగా బయటికి రావాలని భావిస్తున్నానని సుఖేశ్ తెలిపాడు. ఏవో ప్రయోజనాలు ఆశించి కాకుండా స్వయంగా వాటిని బహిర్గతం చేస్తున్నానని తెలిపాడు.


More Telugu News