కోహ్లీ-గంగూలీ మధ్య కొనసాగుతున్న విభేదాలు.. గంగూలీతో చేయి కలిపేందుకు కోహ్లీ నిరాకరణ.. వీడియో ఇదిగో!

  • తన కెప్టెన్సీ పోవడానికి గంగూలీనే కారణమన్న అభిప్రాయంలో కోహ్లీ
  • ఢిల్లీతో మ్యాచ్ అనంతరం గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ నిరాకరణ
  • పాంటింగ్ చెప్పినా పట్టించుకోని విరాట్
  • 2021లో ఇద్దరి మధ్య మొదలైన విభేదాలు
చూస్తుంటే బీసీసీఐ మాజీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు సమసిపోయినట్టు కనిపించడం లేదు. తన కెప్టెన్సీ పోవడానికి గంగూలీనే కారణమని భావిస్తున్న కోహ్లీ ఈ విషయంలో అప్పట్లో పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశాడు. తాజాగా, వీరిద్దరు ఎదురుపడినా చేతులు కలుపుకోకపోవడం వీరి మధ్య విభేదాలను మరోమారు ఎత్తి చూపింది.

గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా మాజీ సారథి అయిన గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, కోహ్లీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

కరచాలనానికి కోహ్లీ నిరాకరణ
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకుంటున్నసమయంలో గంగూలీ, కోహ్లీ తారసపడ్డారు. అయితే, గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ ఇష్టపడలేదు. దీంతో అతడి పక్కనే ఉన్న డుప్లెసిస్‌తో గంగూలీ చేతులు కలిపాడు. అది చూసిన పాంటింగ్.. గంగూలీతో చేతులు కలపాలని కోహ్లీకి చెప్పినప్పటికీ మరోమారు నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో అమన్ ఖాన్ క్యాచ్ పట్టుకున్న కోహ్లీ డగౌట్‌లో కూర్చున్న గంగూలీని తదేకంగా చూడడం కనిపించింది. 

2021లో మొదలైన విభేదాలు
కోహ్లీ-గంగూలీ మధ్య 2021లో విభేదాలు మొదలయ్యాయి. అప్పుడు భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా, గంగూలీ బీసీసీఐ చీఫ్‌గా ఉన్నాడు. అప్పుడే గంగూలీ టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత గంగూలీ మాట్లాడుతూ.. కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీని కోరినప్పటికీ నిరాకరించాడని పేర్కొన్నాడు. అయితే, కోహ్లీ ఆ వ్యాఖ్యలను ఖండించాడు. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత గతేడాది జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ వైదొలిగాడు.


More Telugu News