చట్టాలు, సెక్షన్లు ఇలాంటి సమయంలోనే గుర్తొస్తాయా?: రేణుకా చౌదరి

  • ఖమ్మం జిల్లా చీమలపాడులో అగ్నిప్రమాదం
  • ముగ్గురి మృతి... పలువురికి గాయాలు
  • క్షతగాత్రులను పరామర్శించిన రేణుకా చౌదరి
  • పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం
ఇటీవల ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా విషాద ఘటన జరగడం తెలిసిందే. కార్యకర్తలు కాల్చిన బాణసంచా ఓ పూరిల్లుపై పడి గ్యాస్ సిలిండర్ పేలగా, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, గాయపడిన వారిని నిమ్స్ ఆసుపత్రిలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులపై మండిపడ్డారు. 

బాధితులను పరామర్శించేందుకు వస్తే, పోలీసులు అధికార జులుం ప్రదర్శించారని ఆరోపించారు. తనను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ప్రయత్నించారని తెలిపారు. పోలీసులకు ఇటువంటి సమయాల్లో చట్టాలు, 144 వంటి సెక్షన్లు గుర్తొస్తాయా? అని విమర్శించారు. 

కాగా, ఈ ప్రమాదంలో సందీప్ అనే వ్యక్తి మరణిస్తే, అతడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి హుటాహుటీన తరలించారని, హడావుడిగా దహనసంస్కారాలు నిర్వహించారని రేణుకా చౌదరి తెలిపారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. 

సందీప్ కు భార్య, కుమారుడు ఉన్నారని, ఇప్పుడు సందీప్ భార్య ఆచూకీ కూడా తెలియడంలేదన్నారు. సందీప్ కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారాన్ని అధికారులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల రాజకీయాలకు పేదలను బలి చేస్తున్నారని రేణుకా చౌదరి విమర్శించారు.


More Telugu News