విజయానికి ఆనంద్ మహీంద్రా చెప్పిన సూచనలు

  • రిస్క్ తీసుకున్న వారినే విజయం వరిస్తుందని ట్వీట్
  • కష్టం లేకుండా ఫలం రాదన్న ఆనంద్ మహీంద్రా
  • సరైన లెక్కలు వేసుకుని, వాస్తవాల ఆధారంగా నడవాలని సూచన
అది మంచి కావచ్చు. స్ఫూర్తినిచ్చే విశేషం కావచ్చు. వింత కావచ్చు. వినూత్న ఆవిష్కరణ కావచ్చు. మేల్కొలిపే సందేశం కావచ్చు. దారి చూపే పోస్ట్ కావచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రోజూ ఇలాంటి విశేషం ఒక్కటైనా తన అనుచరులతో పంచుకోకుండా ఉండలేరు. నాయకత్వానికి సంబంధించి ముఖ్యమైన జీవిత పాఠాలను కెరీర్ ఆరంభించే యువతకు సూచించారు. 

ఓ యువ మహిళా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఓ ప్రశ్న సంధించారు. ‘‘హే ఆనంద్ మహీంద్రా, మీ నాయకత్వం, మహీంద్రా ఎదుగుదలలో మీ విజన్ నాకు ఎంతో నచ్చాయి. ఓ యువ మహిళా ఎంట్రప్రెన్యూర్ గా.. మీరు ఇప్పుడే కెరీర్ ఆరంభించే వారికి ఏ సూచన చేస్తారో వినడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని దివ్య గండోత్ర టాండన్ ప్రశ్నించారు. కష్టం లేకుండా ఫలం రాదంటూ ఆనంద్ మహీంద్రా ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. 

‘‘నేను మొదట జిమ్ లో వ్యాయామాలు చేయడం ప్రారంభించినప్పుడు నా కోచ్ తరచుగా ఇదే మాట (కష్టపడకుండా ఫలితం రాదు) చెబుతుండే వాడు. అది నన్ను సౌకర్య స్థాయి నుంచి మరింత ముందుకు నడిపించింది. ఓ పారిశ్రామికవేత్తగా మీరు విజయం తొందరగా, సులభంగా వస్తుందా? అని సహజంగానే అనుమానిస్తారు. సాధారణంగా దారిలో గోతులు ఉంటుంటాయి. అందుకని కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. 

మీరు మరింత విజయాన్ని చూసినప్పుడు, రిస్క్ తీసుకోవాలన్న తత్వం సహజంగానే తగ్గుతుంది. కనుక కెరీర్ ఆరంభంలో గణించిన అవకాశాల వెంట నడవడం మంచిది. ఎవరు రిస్క్ తీసుకోరో వారు సాధించేదీ ఉండదు’’అని ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. 



More Telugu News