5 అంగుళాల ఎత్తు పెరిగేందుకు రూ.కోటిన్నర ఖర్చు చేసిన అమెరికన్

  • బాధాకరమైన రెండు సర్జరీల తర్వాత ఎత్తు పెరిగానన్న గిబ్సన్
  • తోడు దొరకడంలేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • తొలిసారి సర్జరీ తర్వాత మూడేళ్ల పాటు కష్టపడ్డానని వివరణ
తోడు దొరకడంలేదని ఓ అమెరికన్ హైట్ పెరగాలనుకున్నాడు.. దీనికోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడంతో పాటు బాధాకరమైన సర్జరీలు చేయించుకున్నాడు.. దాదాపు రూ. కోటిన్నర ఖర్చుచేసి 5 అంగుళాల హైట్ పెరిగాక తనకో గర్ల్ ఫ్రెండ్ దొరికిందని సంతోషంగా చెబుతున్నాడు. అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన మోసెస్ గిబ్సన్ వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఖాళీ సమయంలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే, 41 ఏళ్లు వచ్చినా తనకు గర్ల్ ఫ్రెండ్ దొరకడంలేదని, దొరికిన వారు కూడా వెంటనే తనను వదిలిపోతున్నారని చెప్పాడు. దీనికి కారణం తను 5.5 అంగుళాల ఎత్తు ఉండడమేనని అన్నాడు.

ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఆత్మన్యూనతతో బాధపడ్డానని గిబ్సన్ చెప్పాడు. హైట్ పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు వివరించాడు. అవన్నీ విఫలం కావడంతో వైద్యులను సంప్రదించి లెగ్ లెంథెనింగ్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే, ఈ సర్జరీ ఖర్చుతో కూడుకున్నదని, సర్జరీ సమయంలో, ఆ తర్వాత కూడా చాలా నొప్పిని భరించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారన్నాడు. అయినప్పటికీ తాను వెనుకడుగు వేయలేదన్నాడు.

ఎట్టకేలకు 2016 లో 75 వేల డాలర్లు ఖర్చు చేసి మొదటి శస్త్రచికిత్స చేయించుకున్నానని గిబ్సన్ పేర్కొన్నాడు. మూడేళ్ల పాటు జరిగిన ఈ ప్రక్రియతో తాను మూడు ఇంచులు హైట్ పెరిగినట్లు తెలిపాడు. ఎత్తు పెరగడం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, దీంతో మరోమారు సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. ఈసారి 98 వేల డాలర్లు ఖర్చయిందని, రెండు ఇంచులు పెరుగుతానని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నాడు. అయితే, మూడు ఇంచులు పెరగాలని తాను భావిస్తున్నట్లు గిబ్సన్ చెప్పాడు.

రెండు ఇంచులు పెరిగినా సరే తన హైట్ 5 అడుగుల 10 అంగుళాలు అవుతుందని అన్నాడు. కాగా, ఈ సర్జరీల తర్వాత ప్రస్తుతం తనకో గర్ల్ ఫ్రెండ్ దొరికిందని గిబ్సన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, గతంలో తను చేయలేకపోయినవన్నీ ప్రస్తుతం చేయగలుగుతున్నట్లు వివరించాడు. షార్ట్స్ వేసుకోవడం, ఫుల్ బాడీ ఫొటోలు తీసుకోవడం వంటివి ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా చేస్తున్నానని గిబ్సన్ తెలిపాడు. రెండు సర్జరీలకు కలిపి మొత్తం సుమారు 1.75 లక్షల డాలర్లు (మన రూపాయల్లో సుమారు 1.35 కోట్లు) ఖర్చయిందని వివరించాడు.


More Telugu News