ప్రజల తరఫున బిడ్డింగ్ లో పాల్గొంటా: జేడీ లక్ష్మీనారాయణ

  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై సీబీఐ మాజీ జేడీ
  • కార్మికులు, నిర్వాసితులు కలిసి కట్టుగా పోరాడాలని పిలుపు
  • విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పాదయాత్రలో పాల్గొన్న లక్ష్మీనారాయణ.. ఇది కేవలం ట్రైలరేనని వెల్లడి
  • కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు కొనసాగుతున్న పాదయాత్ర
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలంటే ఉద్యమం చేయడం తప్ప మరో మార్గం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కార్మికులు, నిర్వాసితులు, మేధావులు కలిసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రజల తరఫున విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో తాను పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఈమేరకు శనివారం ఉదయం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని ఆరోపించారు. ఉదయం కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చి ప్లాంట్ ను ప్రైవేటీకరించడం లేదని చెప్పి వెళతారు, సాయంత్రానికి కేంద్రం ప్రైవేటీకరణ ఆగబోదని ప్రకటన విడుదల చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని, కలిసికట్టుగా ఉద్యమం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవచ్చని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని అన్నారు. ప్రైవేటీకరణకు జరుగుతున్న బిడ్డింగ్ లో ప్రభుత్వాలే పాల్గొనాలని కోరుకుంటున్నట్లు జేడీ లక్ష్మీనారాయణ వివరించారు.

అవసరమైతే ప్రజల తరఫున తాను బిడ్డింగ్ లో పాల్గొంటానని ఆయన తెలిపారు. ఈ రోజు జరుగుతున్న పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. ప్రైవేటీకరణే కేంద్రం విధానమైతే ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు.

మరోవైపు, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ పేరుతో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ శనివారం పాదయాత్ర చేపట్టింది. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు చేపట్టిన ఈ యాత్రలో కార్మికులతో పాటు పలువురు నేతలు కూడా కలిసి నడుస్తున్నారు. పూటకో ప్రకటన చేస్తోందంటూ కేంద్రంపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి కులస్తీ ఫ్లెక్సీపై కోడిగుడ్లు వేసి నిరసన తెలిపారు.


More Telugu News