తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల్లో అన్నీ తప్పులే.. మళ్లీ సరిచేసుకున్న వేలాదిమంది విద్యార్థులు

  • తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ సంఖ్య తదితర వాటిని తప్పుగా నింపేసిన విద్యార్థులు
  • తప్పులను సరిచేసుకున్న 3,115 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు
  • ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది విద్యార్థులు తమ వివరాలను తప్పులు తడకగా నింపేశారు. చివరికి తమ తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ సంఖ్య, జెండర్, కుటుంబ ఆదాయ వివరాలను కూడా సరిగా నింపలేకపోయారు. ఈ తప్పులను సరిచేసుకునేందుకు ఎంసెట్ అధికారులు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.

దీంతో ఈసారి అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సరిచేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న వారిలో 3,115 మంది, అగ్రికల్చర్‌లో 937 మంది విద్యార్థులు తమ తప్పులను సవరించుకున్నారు. అలాగే, చాలామంది మైనారిటీ, సబ్ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల్లో నమోదు చేసిన తప్పులను సరిదిద్దుకున్నారు.

ఇంటర్నెట్ కేంద్రాలు, కళాశాలల ప్రతినిధుల వల్లే..
తప్పులు సవరించుకున్న వారిలో సీబీఎస్‌ఈ, ఓపెన్ స్కూల్, ఏపీ ఇంటర్ బోర్డు, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఉన్నారు. ఆయా కళాశాలల ప్రతినిధులు, ఇంటర్నెట్ కేంద్రాల వారు దరఖాస్తులను నమోదు చేస్తుండడమే ఇందుకు కారణమని ఎంసెట్ కో కన్వీనర్ ఆచార్య విజయ‌కుమార్ రెడ్డి తెలిపారు. కాగా, ఆలస్య రుసుము రూ. 250తో నేటి వరకు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిన్నటి వరకు 3.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.69 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి నిన్నటి వరకు 49 వేల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు.


More Telugu News