జగన్ అనే సైతాను ఉన్నంత వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదు: నూజివీడు సభలో చంద్రబాబు

జగన్ అనే సైతాను ఉన్నంత వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదు: నూజివీడు సభలో చంద్రబాబు
  • నూజివీడులో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం
  • ఒక్క అవకాశానికి నమ్మి మోసపోయి ప్రజలు బాధపడుతున్నారన్న చంద్రబాబు
  • సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనేది ప్రజల నినాదం కావాలని పిలుపు
  • ఏపీ రోడ్లపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే బాధగా ఉందన్న బాబు
గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అనే సైతాను ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదన్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనేది ప్రజల నినాదం కావాలన్నారు.

చేసిన వాటికే మళ్లీ భూమి పూజలు
భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ప్లాంట్‌కు తాము అప్పుడే భూమిపూజ చేశామని, ఈ ప్రభుత్వం వాటికి మళ్లీ చేస్తోందన్నారు. తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామికవాడను పూర్తి చేసి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దొంగల ముఠాల్లా మారి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీని కాపాడుకునేందుకు ప్రజలు ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అవకాశం లేకే శ్రీనివాస్‌ను వదిలేశారు
పోలీసులు త్యాగానికి మారుపేరని, కానీ కొందరి తీరువల్ల వారి ప్రతిష్ఠ మసకబారుతోందని చంద్రబాబు అన్నారు. పోలీసులు ఇప్పుడు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ రుణం తీర్చుకునేందుకే కోడికత్తి డ్రామా ఆడానని, సానుభూతి వస్తే ఓట్లు, సీట్లు పెరుగుతాయని అలా చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడన్నారు. నిజానికి అవకాశం దొరికితే శ్రీనివాస్‌ను చంపేసి ఆ నెపాన్ని తనపై వేసి మరో జగన్నాటకానికి తెరతీసేవారని అన్నారు.

తిరుపతి పింక్ డైమండ్‌ను కాజేశానన్నారు
జగన్ ప్రతిపక్షంలో ఉండగా తిరుపతి పింక్ డైమండ్‌ను తానే కాజేశానని అన్నారని, అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అంటున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో రోడ్లు కూడా లేవని తెలంగాణ నేతలు ఎద్దేవా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News