రింకూ పవర్ మ్యాజిక్ పనిచేయలేదు... కోల్ కతాలో 'సన్ రైజ్'

  • ఐపీఎల్ లో మరోసారి హోరాహోరీ మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్లకు 228 రన్స్ చేసిన సన్ రైజర్స్
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 రన్స్ చేసిన కోల్ కతా
  • 25 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపు
  • 31 బంతుల్లో 58 పరుగులు చేసిన రింకూ సింగ్
  • 75 పరుగులు చేసిన నితీశ్ రాణా
  • ఆఖరి ఓవర్ మెరుగ్గా వేసిన ఉమ్రాన్ మాలిక్
విధ్వంసక బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన రింకూ సింగ్ మ్యాజిక్ ఈసారి పనిచేయలేదు. కోల్ కతా నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఓడించింది. ఆఖరి ఓవర్లో కోల్ కతా గెలవాలంటే 32 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు 8 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. 229 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా కూడా గట్టిగానే పోరాడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. 

ముఖ్యంగా, రింకూ సింగ్ భయపెట్టినా, కీలక సమయాల్లో పరుగులు కట్టడి చేసి, వికెట్లు తీసిన సన్ రైజర్స్ నే విజయం వరించింది. రింకూ 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా సైతం విధ్వంసక ఆటతీరుతో సన్ రైజర్స్ గుండెల్లో గుబులు రేకెత్తించాడు. రాణా 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 75 పరుగులు చేశాడు. అయితే, రింకూ సింగ్, నితీశ్ రాణా ఇచ్చిన పలు క్యాచ్ ను సన్ రైజర్స్ ఫీల్డర్లు జారవిడవడంతో వారిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

అంతకుముందు, కోల్ కతా ఓపెనర్ జగదీశన్ 36 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ డకౌట్ అయ్యారు. ప్రమాదకర ఆండ్రీ రస్సెల్ 3 పరుగులకే తుస్సుమన్నాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2, మయాంక్ మార్కండే 2, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోల్ కతా ఇన్నింగ్స్ లో తొలుత ఒక ఓవర్ విసిరిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా 28 పరుగులు సమర్పించుకోవడంతో, మళ్లీ అతడికి బౌలింగ్ ఇచ్చేందుకు సన్ రైజర్స్ కెప్టెన్ మార్ క్రమ్ సాహసించలేదు. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను వేసేందుకు అప్పటికే ఇతర బౌలర్లకు కోటా అయిపోవడంతో, ఉమ్రాన్ మాలిక్ కు బంతి ఇవ్వక తప్పలేదు. 

ఉమ్రాన్ మాలిక్ ఈసారి తన కెప్టెన్ నిర్ణయాన్ని వమ్ము చేయలేదు. ఓ వికెట్ తీయడంతో పాటు రింకూ సింగ్ ను సమర్థంగా నిలువరించి సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ 100, కెప్టెన్ మార్ క్రమ్ 50, అభిషేక్ శర్మ 32 పరుగులు చేశారు.


More Telugu News