అసెంబ్లీ లో ఆయన చెప్పినన్ని గాలి కథలు ఎవరూ చెప్పి ఉండరు: లోకేశ్

  • డోన్ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 900 కిమీ పూర్తి చేసుకున్న యువగళం
  • ప్యాపిలి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేశ్
  • ఆర్థికమంత్రి బుగ్గనపై విమర్శనాస్త్రాలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం 70వ రోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ప్యాపిలి బీసీ కాలనీలో యువ‌గ‌ళం 900 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆలూరు, ప‌త్తికొండ‌, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల ప్రజ‌ల‌కు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించిన లోకేశ్... ఇందుకు గుర్తుగా ప్యాపిలి వద్ద శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు. 

గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి 70వ రోజు పాదయాత్ర అభిమానుల కేరింతల నడుమ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్గమధ్యంలో ఉద్యానవన, వేరుశెనగ రైతుల వద్దకు వారి సమస్యలు తెలుసుకున్నారు. 

యాదవులు, మామిడి రైతులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం ప్యాపిలిలో స్థానిక మహిళలు, వృద్ధులు, యువకులు లోకేశ్ ను చూసేందుకు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన యువనేత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్యాపిలి శివార్లలో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు.

జగన్ దళితులకు చేసిందేమీ లేదు!

అంబేద్కర్ జయంతి సందర్భంగా సాక్షి పత్రిక, ఛానెల్, వైసీపీ నాయకులు, సాక్షి యజమాని భారతి రెడ్డి గారు దళితుల్ని అవమానపర్చారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఆరోపించారు.  ప్యాపిలి బహిరంగసభలో యువనేత లోకేశ్ మాట్లాడుతూ... జగన్ దళితులకు పీకింది, పొడిచింది ఏమి లేదు అని ఎస్సీల సమావేశంలో అంటే ఆ వీడియో ని ఫేక్ ఎడిట్ చేసి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. 

"10 ఏళ్ల నుండి సాక్షిలో నాపై అనేక అసత్య వార్తలు రాస్తున్నారు. నేను వైసీపీ నేతలకు, భారతి రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు రాసిన వార్తకి సంబంధించిన అసలైన వీడియో విడుదల చెయ్యాలి... లేకపోతే దళితులకు క్షమాపణ చెప్పాలి. నేను ఇప్పటికే అసలైన వీడియో మీడియాకి విడుదల చేశాను. దళితుల్ని చంపుతున్న వైసీపీ నేతలు, నేను అవమానించానని మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

మహామహులు ఏలిన నేల డోన్!

డోన్ దద్దరిల్లిందని, డోన్ దెబ్బకి వైసీపీ నాయకుల దిమ్మతిరిగిపోతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు 1962 లో డోన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నవ్యాంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు డోన్ నుండే ఎమ్మెల్యేలుగా గెలిచారని వివరించారు. 

"మద్దిలేటి లక్ష్మినరసింహస్వామి, గుండాల చెన్నకేశవస్వామి పుణ్యక్షేత్రాలు ఉన్న నేల ఈ డోన్. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న డోన్ నేలపై నడవడం నా అదృష్టం. అంబేద్కర్ గారి జయంతి సంధర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాను" అని తెలిపారు.

రెడ్డి సోదరులు ఒక్కసారి ఆలోచించాలి!

డోన్ లో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించండి అని లోకేశ్ పిలుపునిచ్చారు. మీరు జగన్ ని గెలిపించడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు... ఇప్పుడు మీకు కనీస గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. "కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా? 

ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న డోన్ కి ఇప్పుడు ఒక అసమర్ధ ఎమ్మెల్యే ఉన్నారు. అసెంబ్లీలో ఆయన చెప్పిన అన్ని గాలి కథలు ఎవరూ చెప్పి ఉండరు. ఆర్థికశాఖ మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధిలో డోన్ నెం.1 గా ఉండాలి. కానీ డోన్ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తుంది" అని వివరించారు.

డోన్ లో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు!

మీ ఎమ్మెల్యే గారి పేరు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి... డోన్ లో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు... అంటూ లోకేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రిపై ధ్వజమెత్తారు. "ఈయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ... ఢిల్లీలో ఉండేది ఎక్కువ. ఎందుకో తెలుసా అప్పు కోసం. అందుకే ఈయనకు అప్పుల అప్పారావు అని పేరు పెట్టా. 

అప్పుల అప్పారావు గారు అవినీతిలో మాత్రం తోపు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గనులు ఏమీ వదలడం లేదు. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నారు మన అప్పుల అప్పారావు. డోన్ నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి తన బంధువులకు పంచేశారు. ఇసుక ఒకరికి, మట్టి ఒకరికి, మైన్స్ ఒకరికి" అంటూ దుయ్యబట్టారు.

బుగ్గన గారి దోపిడీ స్టయిలే వేరు!

దోపిడీ లో ఈయన స్టయిల్ వేరని లోకేశ్ అభివర్ణించారు. ఇక్కడ ఉండే క్రషర్లు, మైన్ల యజమానులకు భారీగా పెనాల్టీలు వేస్తారని,. తరువాత ఈయన మనుషులు రంగంలోకి దిగి సెటిల్మెంట్ అంటూ డబ్బులు కొట్టేస్తుంటారని వివరించారు. 

"కరోనా టైంలో సహాయనిధి అంటూ మైన్స్ యజమానుల నుండి డబ్బులు వసూలు చేసి మింగేశారు మన అప్పుల అప్పారావు. డోన్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి రవాణా మొత్తం అప్పుల అప్పారావు గారు మేనల్లుడు గజేంద్ర రెడ్డికి అప్పగించారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.6000, టిప్పర్ రూ.25,000 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాని కూడా క్యాష్ చేసుకుంది అప్పుల అప్పారావు కుటుంబం. ఈయన అన్న బుగ్గన హరినాథ్ రెడ్డి ఎండీగా ఉన్న కంపెనీ నుండి ప్రభుత్వం పీపీఏ కిట్లు కొనుగోలు చేసింది. ఈ కాంట్రాక్టులో కోట్లు కొట్టేసారు. 

ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో సర్వే నెంబర్ 870 లో దాదాపు 500 ఎకరాలు కాజేశారు మన అప్పుల అప్పారావు అనుచరులు. డోన్ రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డికి చెందిన రూ.5 కోట్లు విలువ చేసే భూమిని గజేంద్ర రెడ్డి కబ్జా చేసారు" అని ఆరోపించారు.

డోన్ ను అభివృద్ధి చేసింది టీడీపీనే!

డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీయేనని లోకేశ్ స్పష్టం చేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది టీడీపీయేనని వెల్లడించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ అని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పన్నులు తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తాం అని హామీ ఇచ్చారు. ప్యాపిలి మండలంలో 4 లైన్ రోడ్డు పనులు మొదలు పెట్టి ఆపేశారని, ఆ పనులు మేము పూర్తి చేస్తామని తెలిపారు. డోన్ లో పాలిటెక్నిక్ కళాశాల, ప్యాపిలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలి అనే డిమాండ్ ఉంది... టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం" అని వివరించారు.

లోకేశ్ ను కలిసిన వీఆర్ఏ సంఘం ప్రతినిధులు

నారా లోకేశ్ ను కలిసిన వీఆర్ఏ సంఘం ప్రతినిధులు సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలమంది వీఆర్ఏలు రెవిన్యూ శాఖలో దశాబ్ధాలుగా సేవలందిస్తున్నట్టు వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నా తమకు పేస్కేలు అమలు చేయడం లేదని తెలిపారు. వీఆర్ఏలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని,. నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని పేర్కొన్నారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తూ సేవలందిస్తున్న  వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లకు టీడీపీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 902.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.2 కి.మీ.*

*71వరోజు (15-4-2023) యువగళం వివరాలు:*

*పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 – పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.30 – యర్రగుంటపల్లి క్రాస్ వద్ద చేనేతలతో సమావేశం.

7.55 – కలచర్లలో స్థానికులతో భేటీ.

9.35 – ఎస్.రంగాపురం వద్ద ఎన్టీఆర్ హౌసింగ్ బాధితులతో సమావేశం.

10.30 – పాదయాత్ర పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

11.05 – శభాష్ పురం వద్ద స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.00 – పెద్దకొండ వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.00 – పెద్దకొండ నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.45 – గుడిసె గుప్పరాలలో సర్పంచ్ లతో సమావేశం.

4.00 – డి.సి కొండ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

5.00 – రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం.

6.45 – రాంపల్లి శివార్లలో విడిది కేంద్రంలో బస.



More Telugu News