స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుంది: భూమా అఖిలప్రియ

  • ఎమ్మెల్యేలు ఇంటింటికీ వచ్చి బలవంతంగా స్టిక్కర్లు అతికిస్తున్నారన్న అఖిలప్రియ
  • వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్య
  • యువకుల కోసం నారా లోకేశ్ ప్రత్యేక మేనిఫేస్టో తయారు చేశారని వెల్లడి 
జగన్ స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. కర్నూలు జిల్లాలో సాగుతున్న టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో అఖిలప్రియ మాట్లాడుతూ.. యువకుల కోసం నారా లోకేశ్ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వచ్చి బలవంతంగా స్టిక్కర్లు అతికిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను గమనించకుండా.. ఎమ్మెల్యేలు స్టిక్కర్లు తీసుకువచ్చి వాళ్లకు ఇష్టమున్నా లేకున్నా గోడలకు అతికిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైసీపీ నాయకులు, వాళ్ల కార్యకర్తలే బాగుపడ్డారని విమర్శించారు.

జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్రకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని అన్నారు. ప్రజలు తమ తమ సమస్యలను లోకేశ్ కు చెప్పుకుంటున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కాదు.. తిరుగుబాటు మొదలైందన్నారు. ఎమ్మెల్యే బ్యాగులతో స్టిక్కర్లు తీసుకుని వచ్చి ఇంటింటికీ అతికించడం కాదని, వాళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు.


More Telugu News