అమ్మ కవితమ్మ.. ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా?: షర్మిల

  • లిక్కర్ కుంభకోణంలో నిజాయతీని నిరూపించుకోవాలని షర్మిల సవాల్
  • నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారని వ్యాఖ్య 
  • కూతురును కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శ 
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. లిక్కర్ స్కాంలో రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? అంటూ ఎద్దేవా చేశారు. కవితకు రూ. 15 కోట్లు ఇచ్చినట్టు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆమెతో జరిపినట్టుగా వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇదంతా అవాస్తవం అని, సుఖేష్ తో తనకు పరిచయమే లేదని కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన షర్మిల.. కవితను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. 

'అమ్మ కవితమ్మ. అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు.. నీ బండారం బట్టబయలైతే, అవి మీడియా ప్రసారం చేస్తే.. పాత్రికేయులకు, మీడియా సంస్థలకు విలువలు లేవని మాట్లాడుతున్న నీకు ఏం విలువ ఉన్నట్లు? బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా.! లిక్కర్ స్కాంలో రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇయ్యమంటావా?‘ అని ప్రశ్నించారు. 

ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే ఈటెల రాజేందర్ ను సీఎం కేసీఆర్ పార్టీలోంచి సస్పెండ్ చేశారని, లిక్కర్ స్కాంకు పాల్పడిన కవితను మాత్రం సస్పెండ్ చేయకుండా రాచమర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో స్వాగతం పలికారని విమర్శించారు. బిడ్డను కాపాడుకొనేందుకు ఢిల్లీ వీధుల్లో తిరిగారని, తోడుదొంగలంతా ఒక్కటైనట్లు మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడారని షర్మిల పేర్కొన్నారు. ‘నువ్వు నిజంగా అవినీతికి పాల్పడకపోతే నీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ప్రజల ముందు నీ నిజాయతీని నిరూపించుకో. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారు. కానీ ఎప్పటికీ తలవంచరు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి.. పనికిమాలిన పనులు’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.


More Telugu News