శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి.. ప్రదర్శనకా, ప్రయోగానికా?

  • అంతరించిపోతున్న జంతుజాలం జాబితాలో టోక్‌ మకాక్‌ రకం కోతులు
  • శ్రీలంకలో 30 లక్షలకు పైనే ఉన్న ఈ రకం కోతులు
  • చైనా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన లంక
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతరించిపోతున్న ఓ రకం కోతులను చైనాకు ఎగుమతి చేయనుంది. తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక వెల్లడించింది. ‘టోక్ మకాక్‌’ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులకు సూచించినట్లు వచ్చిన వార్తా కథనం చర్చనీయాంశమైంది. ‘టోక్‌ మకాక్‌’ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి.
 
చైనాలోని వెయ్యి జూలలో ప్రదర్శనకు గాను చైనా లక్ష కోతులను కోరిందని మహింద అమరవీర తెలిపారు. తమ దేశంలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉన్నందున.. డ్రాగన్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు. 

కాగా, ప్రస్తుతం శ్రీలంకలో టోక్‌ మకాక్‌ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా. ఇవి స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని, ఈ తరుణంలోనే చైనా నుంచి అభ్యర్థన వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కోతులను ఉచితంగా ఇస్తారా? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా? అనే అంశంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు. అదే సమయంలో ఈ కోతులను చైనా నిజంగానే జూలో ప్రదర్శనకు ఉంచుతుందా? లేక వాటిపై ఏవైనా ప్రయోగాలు చేస్తుందా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.


More Telugu News