జగన్ స్టిక్కర్ చించేసిన కుక్కపై.. టీడీపీ నేతల సెటైరికల్ ఫిర్యాదు

  • ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకు నిరసనగా కుక్కపై ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళా నేతలు
  • స్టిక్కర్ మీద చెయ్యి పడితే హత్యాయత్నం కేసులు పెడతామని మల్లాది విష్ణు బెదిరిస్తున్నారని వ్యాఖ్య
  • మరి కుక్కపై ఏ కేసు పెడతారో, ఏ జైల్లో పెడతారోనని ఎద్దేవా
వైసీపీ ప్రభుత్వం ఇటీవల ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని, ఇంటి యజమాని అనుమతితో జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ ను అంటిస్తున్నారు. అయితే ఇలా ఓ గోడకు అతికించిన జగన్ స్టిక్కర్ ను ఓ కుక్క పీకేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సెటైరికల్ గా స్పందిస్తున్నారు. జగన్ స్టిక్కర్ ను తొలగించిన కుక్కపై కేసులు పెట్టాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు ఓ అడుగు ముందుకేసి.. స్టిక్కర్ చించేసి సీఎం జగన్ ను అవమానించిన కుక్కను జైల్లో పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ నేతృత్వంలో మహిళలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని జగన్ స్టిక్కర్లు చించిన కుక్కపై ఫిర్యాదు చేశారు. స్టిక్కర్ చించుతున్న కుక్క వీడియోను కూడా పోలీసులకు అందించారు.

‘‘151 సీట్లు గెలుచుకున్న ప్రియతమ నాయకుడు జగన్ ను కుక్క కూడా అవమానించడం చాలా బాధాకరం. ఆయన గౌరవం ఎక్కడా తగ్గకూడదు. స్టిక్కర్ ను కుక్క చించేయడం జగనన్నకి ఎంత మచ్చ. ఎంత నామోషీ. ఇది మళ్లీ రిపీట్ కావద్దని కుక్కపై ఫిర్యాదు చేశాం. కుక్కను తీసుకురావాలి. వెనుక ఉండి కుక్కతో చించేయించిన వాళ్లను కూడా తీసుకురావాలి. కుక్కలే కావచ్చు.. మనుషులే కావచ్చు.. కుక్కతోపాటు అలా చేయించిన కుక్కల్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టాలని కోరాం’’ అని దాసరి ఉదయశ్రీ చెప్పారు. 

‘‘జగన్ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులు విచ్చలవిడిగా పెడుతున్నారు. అందుకే స్టిక్కర్ చించిన కుక్క మీద కూడా కేసు పెట్టాలి. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ స్టిక్కర్ మీద చెయ్యి పడినా హత్యాయత్నం కేసులు పెడతామని మల్లాది విష్ణు బెదిరిస్తున్నారు. మరి కుక్కను మల్లాది విష్ణు ఏం చేస్తారో, ఏ జైల్లో పెడతారో, ఏ కేసు పెడతారో చూడాలి’’ అని అన్నారు. విచారణ జరిపి కుక్క వెనకాల ఉన్న కుక్కలను కూడా తీసుకువచ్చి జైల్లో పెట్టాలని కోరారు. ప్రతిపక్షాలను బెదిరించినట్లే ఇప్పుడు ఈ కుక్కపైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిలదీశారు.


More Telugu News