కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర.. అనంతపురం జిల్లా వాసులకు సదా బానిసను అన్న లోకేశ్

  • డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • ఉమ్మడి అనంతపురం జిల్లా సమస్యలను తీర్చే బాధ్యత తనదే అన్న లోకేశ్
  • జిల్లా వాసులు యాత్రను ప్రభంజనం చేశారని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తయింది. ఈరోజు యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గంలోకి యాత్ర అడుగుపెటింది. ఈ సందర్భంగా లోకేశ్ కు అనంతపురం జిల్లా నేతలు, కార్యకర్తలు వీడ్కోలు పలకగా... కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 

మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తన యాత్ర పూర్తి కావడంపై లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. అనంతపురం ప్రేమను తాను వరంగా పొందానని చెప్పారు. జిల్లా ప్రజల బాధలు విన్నానని, సమస్యలను ప్రత్యక్షంగా చూశానని, వాటి పరిష్కార బాధ్యతలను తానే తీసుకుంటానని చెప్పారు. 'యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో అనంత‌పురం జిల్లాలో నేను ప్ర‌వేశించేస‌రికి ఓ వైపు ఎండ‌లు మండిపోతున్నాయి. వ‌డ‌గాలుల తీవ్ర‌త పెరిగింది. ఇవేవీ నాపై అభిమానాన్ని కురిపించే జ‌నానికి అడ్డంకి కాలేదు. ప్ర‌జాభిమాన‌మే బ‌ల‌మై, జ‌న‌మే ద‌ళ‌మై, తెలుగుదేశం నేత‌లే సార‌థులై, కార్య‌క‌ర్త‌లే వార‌ధులై నా పాద‌యాత్ర‌ని విజ‌య‌వంతం చేశారు. అనంత‌పురం జిల్లా ప్రేమ‌ని వ‌రంగా అందించిన ప్ర‌జ‌లు, తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, మీడియా మిత్రులు, వాలంటీర్లు అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.  

జిల్లా ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్నాను. స‌మ‌స్య‌లు ప‌రిశీలించాను. టీడీపీ ఆరంభించిన ప్రాజెక్టులను అర్ధాంత‌రంగా ఆపేసి వైకాపా స‌ర్కారు జిల్లాకి చేసిన అన్యాయాన్ని చూసి ఎంతో బాధ‌ప‌డ్డాను. రాయ‌ల‌సీమని ప‌ట్టిపీడిస్తున్న‌ కరువును శాశ్వతంగా పారదోలాలని మహనీయుడు నందమూరి తారకరాముడి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన హంద్రీనీవా సుజల స్రవంతి పనులను చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించారు. తొలి దశ కాలువ పనులను పూర్తి చేయడంతో పాటు మల్యాల నుండి జీడిపల్లి దాకా ప్రధాన కాలువను వెడల్పు చేయడానికి వెయ్యి కోట్ల నిధులిచ్చి 70 శాతం పనులను పూర్తి చేయించారు.

ఈ జిల్లా మనవడినని హంద్రీనీవా కాలువను రెండు ద‌శ‌ల్లో పదివేల క్యూసెక్కులకు విస్తరిస్తామని జగన్ మాయ హామీలిచ్చారు. విస్తరణ మాట విస్మ‌రించి సాగుతున్న పనులను కూడా నిలిపివేశారు. నాలుగేళ్లలో హంద్రీనీవా పథకాన్ని నిర్ల‌క్ష్యం చేసి అనంతపురం జిల్లాకు తీరని ద్రోహం చేశారు జ‌గ‌న్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం కొలువుతీరగానే హంద్రీనీవా విస్తరణ పనులను కొనసాగించడంతో పాటు ఆయకట్టుకు నీళ్లిచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను' అని జగన్ చెప్పారు. 

ఉరవకొండ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చే బిందుసేద్యం పథకాన్ని వైసీపీ స‌ర్కారు నిలిపేసిందని లోకేశ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే దాన్ని మ‌ళ్లీ ఆరంభిస్తామని చెప్పారు. నాటి టీడీపీ ప్ర‌భుత్వం కృషితో వ‌చ్చిన కియా క‌ర‌ువు నేల‌లో కార్ల‌తో పాటు ఉద్యోగాల పంట పండిస్తోందని అన్నారు. కియా రాక‌తో మారిన ఈ ప్రాంత ముఖ‌చిత్రాన్ని చూసి, ఉప్పొంగిపోయానని చెప్పారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవుతారని, కియా అనుబంధ సంస్థ‌ల‌ని అనంత‌పురం జిల్లాకే తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ-ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామని హామీ ఇచ్చారు. 

వైసీపీ భూబ‌కాసురులు క‌బ్జా చేసిన లేపాక్షి భూముల‌ని స్వాధీనం చేసుకుని, ఆ భూముల్లో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకి కృషి చేస్తామని లోకేశ్ చెప్పారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు మగ్గం ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు. తాత ఎన్టీఆర్, హ‌రి మామయ్య‌, బాలా మామయ్య‌లు వారు పోటీ చేసేందుకు మీ జిల్లానే ఎంచుకున్నారంటేనే... మీ ప్రేమ, ఆప్యాయ‌త‌ల గొప్ప‌త‌నం తెలుస్తోందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ, తన కుటుంబంతో పాటు తననూ ఆత్మీయంగా ఆద‌రిస్తూ వ‌స్తోన్న‌ మీ అనంత‌పురం జిల్లాకి రుణ‌ప‌డి ఉంటానని చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించి, జిల్లాని అభివృద్ధి చేసి ఆ రుణం తీర్చుకుంటానని అన్నారు. అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర‌ని ప్ర‌భంజ‌నం చేసిన మీ ప్రేమ‌కి స‌దా బానిస‌ను అని అన్నారు. 


More Telugu News