తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు... హాజరైన సీఎం కేసీఆర్

  • కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
  • ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు
  • హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
  • మైనారిటీల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్న కేసీఆర్
రంజాన్ పవిత్ర మాసం నేపథ్యంలో, ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తెలంగాణ ముందుకు వెళుతోంది... దేశం వెనుకబడిపోతోంది అని వ్యాఖ్యానించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. 

దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా పాటుపడతామని తెలిపారు. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో దేశాన్ని పరిరక్షించుకుందామని అన్నారు. ఈ దేశం మనది... ఆఖరి రక్తపుబొట్టు వరకు దేశం కోసం పోరాటం సాగిద్దాం అని పిలుపునిచ్చారు. 

మన గంగా యమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు.


More Telugu News