సురేశ్ బాబు చెప్పినట్టుగా వినివుంటే అప్పట్లో 100 ఎకరాలు కొనేవాడిని: పరుచూరి గోపాలకృష్ణ

  • 'సర్పయాగం' గురించి ప్రస్తావించిన పరుచూరి గోపాలకృష్ణ 
  • ఆ సినిమా సూపర్ హిట్ అయిందని వెల్లడి
  • భారీ ఆఫర్లు వచ్చాయన్న గోపాలకృష్ణ
  • అన్నయ్య మాట వలన డైరెక్షన్ దిశగా వెళ్లలేదని వ్యాఖ్య  
పరుచూరి బ్రదర్స్ .. పరిచయం అవసరం లేని పేరు. రచయితలుగా వారికి ఉన్న అనుభవం మాటల్లో చెప్పలేనిది. పరుచూరి గోపాలకృష్ణ 'సర్పయాగం' అనే సినిమాకి దర్శకత్వం కూడా చేశారు. తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. "ముందుగా ఈ సినిమా చేయడానికి శోభన్ బాబు కంగారుపడ్డారు. తాను వరుస మర్డర్లు చేస్తే జనం చూస్తారా" అని అడిగారు. అయితే, ఆయనను ఒప్పించాము అని అన్నారు. 

ఈ సినిమా కోర్టు సీన్ జరుగుతున్నప్పుడు రామానాయుడు గారు ట్రాలీ తోశారు. డైలాగ్స్ బాగా రాశానని మెచ్చుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అనే విషయాన్ని సురేశ్ బాబు గారు వచ్చి చెప్పారు. వెంటనే డైరెక్టర్ గా తమ బ్యానర్లో ఒక సినిమా చేసి పెట్టమని దేవిప్రసాద్ గారు .. త్రివిక్రమరావు గారు .. అశ్వనీ దత్ గారు .. శ్రీనివాసప్రసాద్ గారు డబ్బుల కట్టలు అడ్వాన్స్ గా టేబుల్ పై పెట్టారు. 

ఆ అడ్వాన్సులు నేను తీసుకుని ఉంటే అప్పట్లో శంకర్ పల్లిలో 100 ఎకరాలు కొనేవాడిని. అప్పట్లో అక్కడ ఎకరం పదివేలు ఉండేది. అడ్వాన్సులు తీసుకోమనీ .. పరుచూరి బ్రదర్స్ ఇద్దరికీ చెరో 50 ఎకరాలు అక్కడ కొనిపెడతానని సురేశ్ బాబుగారు చెప్పారు. కానీ నేను డైరెక్షన్ సైడ్ వెళ్లడం ఇష్టం లేక మా అన్నయ్య వద్దన్నాడు. ఆ తరువాత మాత్రం ఆయన చాలా బాధపడ్డాడు" అని చెప్పుకొచ్చారు.


More Telugu News