కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు

  • గెహ్లాట్ తనకు మంచి మిత్రుడన్న మోదీ
  • సొంత పార్టీలో సమస్యలను ఎదుర్కొంటూనే గెహ్లాట్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని కితాబు
  • తనతో స్నేహంపై నమ్మకం ఉంచిన గెహ్లాట్ కు అభినందనలు తెలియజేస్తున్నానని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో జాతీయ పార్టీల నేతల నుంచి ఊహించని కామెంట్లు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. గెహ్లాట్ తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. రాజస్థాన్ నుంచి తొలి వందే భారత్ రైలును ఈరోజు మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించిన మోదీ... అనంతరం ప్రసంగిస్తూ గెహ్లాట్ ను కొనియాడారు. 

తన ప్రసంగంలో సీఎం గెహ్లాట్ కేంద్రాన్ని కోరుతున్న కొన్ని డిమాండ్లను ప్రస్తావించిన ప్రధాని... కాంగ్రెస్ లో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలను సైతం ప్రస్తావించారు. గెహ్లాట్ తన సొంత పార్టీలోనే సమస్యలను ఎదుర్కొంటున్నారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను సైతం పక్కన పెట్టి గెహ్లాట్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని... ఈనాటి వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం హాజరయ్యారని కితాబునిచ్చారు. గెహ్లాట్ కు తాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.  

జైపూర్ లో వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డ్ ఛైర్మన్ ఇద్దరూ రాజస్థాన్ కు చెందిన వారేనని చెప్పారు. తనతో ఉన్న స్నేహంపై నమ్మకం ఉంచిన మీకు ధన్యవాదాలు చెపుతున్నానని అశోక్ గెహ్లాట్ ను ఉద్దేశించి అన్నారు. మీ నమ్మకం నా బలం అని చెప్పారు. మిత్రత్వంపై మీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు అని అన్నారు.


More Telugu News