బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు!

  • ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమ్మేళనంలో అపశ్రుతి 
  • బాణసంచా కాలుస్తుండగా గుడిసె దగ్ధమై పేలిన సిలిండర్
  • గాయపడ్డ వారిలో పోలీసులు, కార్యకర్తలు, జర్నలిస్టులు!
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు చేరువ అయ్యే కార్యక్రమాలు చేబడుతోంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములూ నాయక్‌ ఆధ్వర్యంలో కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన సమ్మేళనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 

పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. ఆ మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి వ్యాపించి ఓ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలముకుంది. అప్పటి వరకు నేతల రాకతో సందడిగా ఉన్న ప్రాంతం పేలుడు తర్వాత రక్తసిక్తమైంది.


More Telugu News