స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ పార్టీ వైఖరేంటో చెప్పాలి: మంత్రి అమర్నాథ్

  • స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోందని ప్రచారం
  • ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటారన్న అమర్నాథ్
  • స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని వెల్లడి
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి బృందం పర్యటించడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 

తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై మాట్లాడగలమని నిన్న వ్యాఖ్యానించిన మంత్రి అమర్నాథ్... ఇవాళ తమ వైఖరిని దాదాపుగా స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలని అన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ వైఖరి ఏంటన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటారని అమర్నాథ్ ప్రశ్నించారు. 

ఏడాదిన్నర కిందట కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం ఇచ్చిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. 

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అనేదే తమ నినాదం అని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకమేనని, సీఎం జగన్ కూడా ప్రైవేటీకరణ వద్దనే ప్రధానికి చెప్పారని మంత్రి అమర్నాథ్ వివరించారు.


More Telugu News