ఈ ఏడాది సాధారణ వర్షపాతమే: ఐఎండీ

  • భారత్ లో జూన్ లో నైరుతి రుతుపవనాల ఆగమనం
  • సెప్టెంబరు వరకు వర్షపాతం
  • ఈ ఏడాది అంచనాలను వెలువరించిన ఐఎండీ
  • 96 శాతం వర్షపాతం కురుస్తుందని వెల్లడి
ఏవో కొన్నిసార్లు తప్పితే, సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో వస్తుంటాయి. సెప్టెంబరు వరకు వర్షపాతాన్ని అందిస్తాయి. దేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. దీనికి సంబంధించి భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా అంచనాలను వెలువరించింది. 

ఈ ఏడాది రుతుపవనాల సీజన్ లో దేశంలోని చాలా భాగాల్లో సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. వాయవ్య భారతం, పశ్చిమ, మధ్య, ఈశాన్యభారతంలో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. 

దీనిపై కేంద్రం భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ స్పందించారు. మొత్తమ్మీద 96 శాతం వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నాయని వివరించారు. ఈ అంచనా 5 శాతం అటూ ఇటూగా ఉండొచ్చని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దీర్ఘకాల వర్షపాత సగటు 87 సెంటీమీటర్లు అని వెల్లడించారు. 

ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియరాలజీ ఎం.మొహాపాత్ర స్పందిస్తూ... సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 67 శాతం అవకాశాలున్నాయని తెలిపారు. 

ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగానే ఎల్ నినో పరిస్థితుల్లో భారత్ లో రుతుపవనాల సీజన్ మెరుగైన వర్షపాతాన్నే అందిస్తుందని ఐఎండీ భావిస్తోంది. ఈసారి ఎల్ నినో నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్థంలో ప్రభావం చూపే అవకాశాలున్నట్టు అంచనా వేసింది. 1951 నుంచి 2022 వరకు చూస్తే 40 శాతం ఎల్ నినో సంవత్సరాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ చెబుతోంది.


More Telugu News