కాంగ్రెస్ కు ఓపెన్ చాలెంజ్.. సచిన్ పైలట్ దీక్షపై బీజేపీ

  • సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు దీక్షకు దిగిన సచిన్ పైలట్ 
  • గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సి వస్తుందన్న కాంగ్రెస్ హైకమాండ్
  • హస్తం పార్టీ ఇక పూర్తిగా మునిగిపోతుందన్న బీజేపీ
రాజస్థాన్‌లో గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ ఈ రోజు నిరాహార దీక్షకు దిగారు. జైపూర్‌లోని షహీద్ సమార్క్ వద్ద దీక్ష చేపట్టారు. తన దీక్షను ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, నాయకత్వం అంశంగానో భావించరాదని, అవినీతిపై చర్యలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. 

సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్షకు దిగడంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘ఇది పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదు. ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే దాన్ని బహిరంగంగా లేదా మీడియా ముందు కాకుండా పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలి’’ అని ఆ పార్టీ రాజస్థాన్ ఇన్‌చార్జి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా సూచించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. పైలట్ చేపట్టిన దీక్ష కాంగ్రెస్ హైకమాండ్ కు ఓపెన్ చాలెంజ్ అని వ్యాఖ్యానించింది. ‘‘కాంగ్రెస్ హైకమాండ్‌కు సచిన్ పైలట్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆయన చేపట్టిన నిరాహార దీక్షతో కాంగ్రెస్ ఇక పూర్తిగా మునిగిపోతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇప్పటికే పట్టు కోల్పోయింది’’ అని బీజేపీ నేత, రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ అన్నారు.


More Telugu News