హైదరాబాద్ నుంచి మూడో వందేభారత్ రైలు...?

  • సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు
  • తొలి వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు
  • ఈ నెల 8న రెండో వందేభారత్ రైలు (సికింద్రాబాద్-తిరుపతి) ప్రారంభం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రైలు అంటూ వార్తలు
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, కేంద్రం మూడో వందేభారత్ రైలుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన కేంద్రం, ఈ నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ ను పట్టాలెక్కించింది. 

ఈ క్రమంలో, హైదరాబాదు నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలు నడిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే భాగ్యనగరం నుంచి మూడు వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నట్టవుతుంది. 

ఇప్పటికే హైదరాబాద్-బెంగళూరు మధ్య పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. 570 కిమీ దూరాన్ని అవి 11 గంటల వ్యవధిలో పూర్తి చేస్తున్నాయి. అదే వందేభారత్ రైలు అయితే 7 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. 

కాగా, ఈ రైలును కాచిగూడ నుంచి నడుపుతారని గత జనవరిలోనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, సికింద్రాబాద్ నుంచి పూణే నగరానికి వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు నడిపే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.


More Telugu News