విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే జగన్ కు ఆత్మహత్యే గతి.. సీపీఐ నేత రామకృష్ణ

  • జగన్ కు ధైర్యముంటే మోదీ వద్దకెళ్లి ఆపాలన్న రామకృష్ణ 
  • లేకుంటే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్
  • తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటుంటే జగన్ సంక నాకుతున్నాడా? అంటూ మండిపాటు
  • చరిత్ర హీనుడిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యలు
ఏపీలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈవోఐ (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ప్రతిపాదనల బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో అటు బీఆర్ఎస్ పై, ఇటు వైసీపీపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెంటిమెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారంటూ బీఆర్ఎస్ ను బీజేపీ విమర్శిస్తుండగా.. బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటుంటే జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఏపీలోని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

సోమవారం మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆత్మహత్యే శరణ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్‌కు అవమానమన్నారు. జగన్‌ కు ధైర్యముంటే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆపాలని.. లేకుంటే దిగిపోవాలని డిమాండ్ చేశారు.

ఎందరో బలిదానాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని రామకృష్ణ గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోందని మండిపడ్డారు. మోదీ, జగన్ కలిసి ఫ్యాక్టరీని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

‘‘విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటుంటే జగన్ సంక నాకుతున్నాడా? అదే జరిగితే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే ఆంధ్రా ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టని నిలదీశారు.


More Telugu News