ఈ ఏడాది బంగారం ఎంత రాబడిని ఇవ్వొచ్చు?

  • 2023లో 11 శాతం వరకు ర్యాలీ చేయొచ్చన్న అంచనా
  • అంతర్జాతీయంగా 11 శాతం పెరిగితే దేశీయంగా 7 శాతం ర్యాలీ
  • ఈ ఏడాది చివరికి 10 గ్రాములు రూ.68,000 వరకు చేరుకోవచ్చు
బంగారం గత మూడేళ్ల కాలంలో మంచి రాబడులను ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత బంగారంలో మంచి ర్యాలీని చూశాం. ఆ తర్వాత కొంత కాలం పాటు స్తబ్దుగా ఉన్న పసిడి, తిరిగి ఇటీవలే పరుగు అందుకుంది. దీంతో గత వారం దేశీ మార్కెట్లో బంగారం తులం ధర రూ.61వేల మార్క్ దాటింది. దీంతో బంగారం మరోసారి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఈ ధర వద్ద ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అన్న సందేహంతో ఉన్న వారికి విశ్లేషకుల అంచనాలు మార్గం చూపిస్తాయి.

ఈ ఏడాది బంగారం 11 శాతం ప్రతిఫలాన్ని ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి చూసుకుంటే ఈక్విటీ, డెట్ కంటే బంగారం మంచి రాబడిని ఇచ్చింది. అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరప్ మాంద్యం బాట పట్టొచ్చన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో ఇటీవల బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడడం గమనార్హం. జనవరి నుంచి ఇప్పటికే బంగారం 9 శాతం ర్యాలీ చేయగా, నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు 2-3 శాతం మధ్య లాభపడ్డాయి.

బంగారం ధర ఇప్పట్లో దిగిరాకపోవచ్చని ఫండ్ మేనేజర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేసుకునే వారు.. తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం మించకుండా కేటాయించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2,080-2,100 డాలర్ల వద్ద మరో రెండు వారాల పాటు నిలదొక్కుకుంటే అప్పుడు 2,200 డాలర్లకు చేరుకోవచ్చని 360 వన్ వెల్త్ బ్రోకరేజీ సంస్థ హెడ్ విరాల్ షా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు 10 శాతం పెరిగితే, దేశీయంగా 7 శాతం లాభపడొచ్చని.. ఈ ఏడాది చివరికి 10 గ్రాముల ధర రూ.67,000-68,000 చేరుకోవచ్చన్న అంచనాను వ్యక్తపరిచారు.


More Telugu News