సొంతగడ్డపై చెలరేగిన సన్ రైజర్స్ బౌలర్లు... ధావన్ ధమాకా

  • ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ × పంజాబ్ కింగ్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • ఓ దశలో 88 పరుగులకే 9 వికెట్లు డౌన్
  • చివర్లో విజృంభించిన ధావన్
  • 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ సారథి
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్ చేసిన పంజాబ్
సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విజృంభించారు. అయితే కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో పంజాబ్ కింగ్స్ గౌరవప్రద స్కోరు సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఓ దశలో సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ ముగియడానికి మరెంతో సమయం పట్టదనిపించింది.

కానీ, ఓపెనర్ గా బరిలో దిగిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరిపోరాటం సాగించాడు. చివరి బ్యాట్స్ మన్ మోహిత్ రాధీని అడ్డంపెట్టుకుని ధావన్ ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్ కు తెరలేపాడు. దాంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. 

ధావన్, రాధీ 31 బంతుల్లో 55 పరుగులు జోడించారు. ఐపీఎల్ చరిత్రలో 10వ వికెట్ కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ధావన్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో శామ్ కరన్ 15 బంతుల్లో 22 పరుగులు చేయగా... మిగతా బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. ధావన్ బాధ్యతాయుతంగా ఆడకపోయుంటే పంజాబ్ మరీ స్వల్ప స్కోరుకే అవుటయ్యుండేది.

ఇక, సన్ రైజర్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు.


More Telugu News