సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ తమిళ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉంది: స్టాలిన్ ఆగ్రహం

  • ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఆర్పీఎఫ్
  • హిందీ, ఇంగ్లీషులోనే పరీక్ష రాయాలని నిబంధన
  • ప్రాంతీయ భాషల్లోనూ రాసే అవకాశం ఇవ్వాలన్న స్టాలిన్
  • కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ తమిళ అభ్యర్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్టాలిన్ లేఖ రాశారు. 

ఆ నోటిఫికేషన్ హిందీ మాట్లాడే అభ్యర్థులకే ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్ పరీక్షలో తమిళంను చేర్చకపోవడం పట్ల కేంద్రాన్ని ప్రశ్నించారు. తమిళంపై కేంద్రం వివక్ష చూపరాదని స్పష్టం చేశారు. తమిళం సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. 

కేవలం ఇంగ్లిష్, హిందీలోనే పరీక్ష రాయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారని, ఇది ఏకపక్ష నిర్ణయం అని స్టాలిన్ మండిపడ్డారు. దీనివల్ల అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగార్థుల రాజ్యాంగ పరమైన హక్కుకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై అమిత్ షా తక్షణమే జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు. 

సీఆర్పీఎఫ్ ఇటీవల టెక్నికల్, ట్రేడ్స్ మన్ విభాగాల్లో 9,212 కానిస్టేబుల్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


More Telugu News