తన బ్యాటింగ్ విధ్వంసంపై స్పందించిన రహానే

  • వాంఖడే సొంత మైదానం కావడం కలిసొచ్చిందన్న రహానే
  • అవకాశం ఎప్పుడొచ్చినా మంచి ఫలితాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తానని వెల్లడి
  • తుది జట్టులో అవకాశం గురించి చివర్లోనే తెలిసిందని వెల్లడి
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం నాటి మ్యాచ్ చూసిన వారు.. అజింక్య రహానే బ్యాటింగ్ విధ్వంసానికి ముచ్చటపడకుండా ఉండలేరు. కేవలం 27 బంతులను ఎదుర్కొన్న రహానే 61 పరుగులు రాబట్టి అవుటయ్యాడు. జట్టు విజయంలో అతడి ఇన్సింగ్స్ ఎంతో కీలకమని చెప్పుకోవాలి. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత అజింక్య రహానే తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. 

‘‘వాంఖడేలో ఆడడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. అయితే ఎప్పుడూ కూడా ఈ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కనుక ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. నేటి తుది 11 మందిలో నా స్థానంపై స్పష్టత లేదు. టాస్ కు ముందే నాకు చోటు గురించి తెలిసింది. నా వరకు అయితే నేను వచ్చిన అవకాశాన్ని వదులుకోను. సంతోషం, అభిరుచితో ఆడాలని అనుకుంటాను.

నేను ఏ ఫార్మాట్ లో ఆడుతున్నా సరే ప్రతీ సారీ నా వంతు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అంతేకానీ భవిష్యత్తు గురించి ఆలోచించను. ఎందుకంటే అది నా చేతుల్లో, నా నియంత్రణలో ఉండదు. వీలైన ప్రతీ సందర్భంలోనూ ఉత్తమ పనితీరు చూపించి, సానుకూలంగా ఉండడమే చేయగలను. అవకాశం ఎప్పుడు పలకరించినా నేను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంటాను’’అని రహానే చెప్పాడు. తన తాజా ఆటతో టీమిండియా సెలక్టర్లు తనను విస్మరించొద్దని సూచించినట్టయింది. 2022 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులో రహానే చోటు కోల్పోవడం గమనార్హం. 

తనకు వాంఖడే సొంత మైదానం కావడం కలిసొచ్చినట్టు రహానే చెప్పాడు. ‘‘టాస్ కు ముందే నేను ఆడుతున్నట్టు తెలిసింది. దురదృష్టవశాత్తూ మొయిన్ అలీ అందుబాటులో లేడు. ఈ వికెట్ ఎలా పనిచేస్తుందో నాకు ఐడియా ఉంది. బంతులు ఎలా వస్తాయన్నది తెలుసు. అది నాకు సాయపడింది. మెరుగైన సాధన చేశాను. నేను చక్కగా ఆడడం, మ్యాచ్ గెలవడం పట్ల సంతోషంగా ఉంది’’అని వివరించాడు.


More Telugu News