ఈ సంకేతాలు కనిపిస్తే స్ట్రోక్ ముప్పు వస్తున్నట్టే!

  • శరీరంలో ఒకవైపు భాగంలో తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం
  • తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వాంతులు
  • సరిగ్గా మాట్లాడలేకపోవడం, నియంత్రణ కోల్పోవడం సంకేతాలే
  • జీవనశైలిలో మార్పులతో రిస్క్ తగ్గించుకోవచ్చు
స్ట్రోక్ దీన్నే పక్షవాతం అని కూడా అంటారు. మెదడులో ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ఏర్పడే పరిణామాన్ని స్ట్రోక్ గా పిలుస్తారు. మెదడులో ఏ భాగం ప్రభావితం అయిందన్న దాని ఆధారంగా కొన్ని అవయవాలు పని చేయకుండా పోవచ్చు. మెదడులో రక్త నాళాలు చిట్లి రక్తస్రావం అయినప్పుడు కూడా స్ట్రోక్ వస్తుంది. రక్తస్రావం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డు పడుతుంది. దీనివల్ల మెదడు దెబ్బతింటుంది. స్ట్రోక్ తీవ్రంగా ఉంటే కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా దారితీయవచ్చు. చాలా స్వల్పంగా ఉంటే, వెంటనే స్పందించి చికిత్స ఇప్పిస్తే అవయవాల పనితీరుపై ప్రభావం పడకుండా ఉంటుంది. ఆలస్యం చేసిన కొద్దీ కొన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. 

సాధారణంగా 50-60 ఏళ్ల వయసు దాటిన వారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్ట్రోక్ అని గుర్తించేందుకు కొన్ని లక్షణాలను సంకేతాలుగా పరిగణించొచ్చు. ముఖంలో బలహీనత కనిపిస్తుంది. పూర్తిగా నవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. మూతిని, కళ్లను సరిగ్గా కదిలించలేరు. కాళ్లు, చేతులను పూర్తిగా, ఎప్పటి మాదిరిగా కదిలించలేకపోతుంటే అది కూడా స్ట్రోక్ కు సంకేతమే. సరిగ్గా మాట్లాడకపోవడం కూడా సంకేతంగా పరిగణించాలి. 

స్ట్రోక్ సమయంలో కంటి చూపులోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. మెదడులో వెనుక భాగంలో స్ట్రోక్ వస్తే కంటి చూపులో ఒకవైపు భాగం ప్రభావితమవుతుంది. ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే అది కూడా స్ట్రోక్ కు సంకేతం కావచ్చు. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఇలా వస్తుంది. రక్తపోటు 200 దాటిపోయినప్పుడు కొందరిలో మెదడు రక్త నాళాలు చిట్లిపోతాయి. ఆ సమయంలో తలనొప్పి స్పష్టంగా తెలుస్తుంది. 

స్ట్రోక్ వచ్చినప్పుడు తిమ్మిర్లు కూడా కనిపిస్తాయి. శరీరంలో ఒకవైపు భాగంలో తిమ్మిర్లు, స్పర్శ కోల్పోయినట్టు ఉంటే అది కచ్చితంగా స్ట్రోక్ వచ్చినట్టు భావించాలి. తల తిరగడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం కూడా కనిపిస్తాయి. వాంతులు కూడా కావచ్చు. కనుక వీటిల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ మానివేయాలి. పోషకాహారం తీసుకోవాలి. బరువు నిర్ణీత ప్రమాణాలకు మించి లేకుండా చూసుకోవాలి. రోజువారీ వ్యాయామం చేయాలి. దీనివల్ల స్ట్రోక్ రిస్క్ ను అధిక శాతం తొలగించుకోవచ్చు.


More Telugu News