స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని అనర్థాలో..

  • వెన్నెముక, కంటి సంబంధిత సమస్యలు
  • కరోనా రాకతో పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ వినియోగం
  • పిల్లల్లో అవగాహన కోసం పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని సూచన
నేడు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. టెలివిజన్ చానళ్లు, కంప్యూటర్, మొబైల్ గేమ్ లు, విద్యా సంబంధిత అప్లికేషన్లు, చివరికి అన్ని ముఖ్యమైన టాస్క్ లు, క్రికెట్ మ్యాచ్ వీక్షణలు అన్నింటికీ స్మార్ట్ ఫోన్ కేంద్రంగా మారిపోయింది. చిన్నారులు, టీనేజీలోని వారు కూడా గంటల తరబడి స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతుంటారు. ఈ క్రమంలో వెన్నెముక, కంటి సమస్యలు పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల దుష్ఫలితాలపై బ్రెజిల్ కు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం కూడా నిర్వహించారు. సైంటిఫిక్ జర్నల్ హెల్త్ కేర్ లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి. రోజులో మూడు గంటలకు మించి స్క్రీన్ ను చూడడం వల్ల అటు కళ్లపై, కూర్చోవడం, పడుకుని చూడడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతున్నట్టు తెలుసుకున్నారు.

దీర్ఘకాలిక వెన్నెముక నొప్పి పై ఈ అధ్యయనం ప్రధానంగా దృష్టి సారించింది. ఛాతీ వెనుక భాగంలో థొరాసిక్ స్పైన్ ఉంటుంది. 14-18 ఏళ్ల వయసులోని వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఛాతీ వెన్నెముక (థొరాసిక్ స్పైన్ పెయిన్) నొప్పి 38 శాతం మందిలో కనిపించింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఎటూ వెళ్లే అవకాశం లేకపోవడంతో, ఎక్కువ గంటల పాటు స్మార్ట్ ఫోన్ పై వెచ్చించాల్సి రావడం కూడా పరిస్థితి తీవ్రతకు కారణమని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. వెన్నెముక నొప్పి వల్ల వారి మానసిక పరిస్థితుల్లోనూ మార్పులు కనిపించినట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్యం పట్ల పిల్లల్లో అవగాహన పెరిగేలా కరిక్యులమ్ ఉండాలని వీరు సూచించారు.


More Telugu News