పబ్లిక్ ప్లేసుల్లో సీసీ కెమెరాలు పెడుతున్న ఇరాన్.. ఎందుకంటే!

  • యాంటీ హిజాబ్ ఆందోళనలపై ఉక్కుపాదం
  • హిజాబ్ ధరించని వారిని గుర్తించి ఫైన్ విధించేందుకు ఏర్పాట్లు
  • డ్రెస్ కోడ్ పై ఇరాన్ మహిళల్లో పెరుగుతున్న వ్యతిరేకత
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ ప్లేసుల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అధికారులు అమర్చుతున్నారు. ఈ కెమెరాలతో బహిరంగ ప్రదేశాలలో హిజాబ్ లేకుండా తిరిగే మహిళలను గుర్తించి, వారికి ఫైన్ విధించే ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని ఇరాన్ ప్రభుత్వం మహిళలను కట్టడి చేస్తోంది. ఈ రూల్ ను పాటించేందుకు మోరల్ పోలీసులను కూడా నియమించింది.

ఈ పోలీసులు వీధుల్లో తిరుగుతూ మహిళల డ్రెస్ కోడ్ ను గమనిస్తుంటారు. ఎవరైనా హిజాబ్ ధరించకపోతే అక్కడికక్కడే అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఇటీవల ఇలాగే అరెస్టు చేసిన ఓ కుర్దీష్ యువతి లాకప్ లో మరణించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మోరల్ పోలీసింగ్ వ్యవస్థపై మహిళలు మండిపడుతున్నారు. తమ నిరసన ప్రకటించేందుకు హిజాబ్ ను తీసేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, వీధులలో హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు.

ఈ యాంటీ హిజాబ్ ఆందోళనలు దేశంలోని అన్నిప్రాంతాలకూ విస్తరించాయి. ఈ నేపథ్యంలో మహిళల డ్రెస్ కోడ్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే బహిరంగ ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించింది. ఈ కెమెరాలతో హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి, వారికి జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. తద్వారా యాంటీ హిజాబ్ ఆందోళనలను అణిచివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News