రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జి నాలుక కోస్తాం..కాంగ్రెస్ నేత షాకింగ్ వ్యాఖ్య

  • ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్‌లో రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసనలు
  • నిరసనల సందర్భంగా కాంగ్రెస్ నేత మణికందన్ వివాదాస్పద వ్యాఖ్య
  • మేం అధికారంలోకి వచ్చాక న్యాయమూర్తి నాలుక కోస్తామంటూ వార్నింగ్
  • మణికందన్‌పై కేసు పెట్టిన పోలీసులు
ఇటీవల క్రిమినల్ డీఫమేషన్‌ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ తీర్పిచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన తమిళనాడు కాంగ్రెస్ నేత మణికందన్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 153బీతో సహా మూడు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. 2019లో ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘మోదీ’ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను దోషిగా పరిగణిస్తూ సూరత్ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. దీంతో.. రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. 

అయితే.. ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మణికందన్ సూరత్ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ మేం అధికారంలోకి వచ్చాక.. రాహుల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తాం’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కలకలం రేగడంతో పోలీసులు మణికందన్‌పై కేసు నమోదు చేశారు.


More Telugu News