‘ఆటో’ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు!

  • కర్ణాటకలో 7.7 లక్షల ఆటోలు
  • ఫలితాలను ప్రభావితం చేసే సంఖ్యలో ఆటో కుటుంబాలు
  • తాము అధికారంలోకి వస్తే నెలకు రూ. 2 వేల చొప్పున ఇస్తామన్న జేడీఎస్
  • ఆటోవాలాలతో కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సమావేశం
  • ఆటో డ్రైవర్ల పిల్లల కోసం పథకాన్ని ప్రకటించామన్న బీజేపీ
కర్ణాటక రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కరుణాకటాక్షాల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. హామీలతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 లక్షలు ఆటోలు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల ఆటోలు యాక్టివ్‌గా ఉన్నాయి. 

ఒక్కో ఆటోవాలా కుటుంబంలో కనీసం నలుగురిని లెక్కలోకి తీసుకున్నా దాదాపు 25 లక్షల ఓట్ల వరకు ఉంటాయి. అంటే.. ఎన్నికల ఫలితాలను వీరు ప్రభావం చేసి అవకాశం ఉన్నట్టే. వీరు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించి తమవైపునకు తిప్పుకునేందుకు పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి.

తాము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తామని ప్రతిపక్ష జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అంతేకాదు, వారి సమస్యలను పరిష్కరిస్తామని, పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఆటోవాలాలను అక్కున చేర్చుకునే  ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో ఆటోవాలాలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఖాకీ చొక్కా ధరించి, స్వయంగా ఆటో నడిపి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాధారణ ప్రజల రథసారథులు మీరేనంటూ వారిని ఆకాశానికెత్తేశారు. 

ఈ విషయంలో తామేమీ తక్కువ కాదన్నట్టు అధికార బీజేపీ కూడా ముందుకొచ్చింది. తాము ప్రకటించిన బడ్జెట్‌లో ఆటోవాలాల పిల్లల కోసం ప్రకటించిన ‘రైతా విద్యానిధి’ పథకాన్ని గుర్తు చేస్తూ.. తమకు ఓటేయాలని కోరుతోంది.


More Telugu News