చిచ్చరపిడుగులా ఆడిన రహానే... దిగ్గజాల పోరులో చెన్నై పైచేయి

  • ముంబయి ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసిన ముంబయి
  • 18.1 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించిన సీఎస్కే
  • 7 వికెట్ల తేడాతో ధోనీ సేన విజయం
ఒకరేమో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబయి ఇండియన్స్... మరొకరేమో నాలుగు పర్యాయాలు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి వాంఖెడే స్టేడియంలో ఈ రెండు దిగ్గజ జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైదే పైచేయిగా నిలిచింది. ముంబయి ఇండియన్స్ విసిరిన 158 పరుగుల టార్గెట్ ను సీఎస్కే జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చెన్నై ఇన్నింగ్స్ లో అజింక్యా రహానే మెరుపు ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. రహానే కేవలం 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులు చేశాడు. రహానే తన అర్ధసెంచరీని కేవలం 19 బంతుల్లోనే పూర్తి చేసుకోవడం విశేషం. 

ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రహానేను ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో బేస్ ప్రైస్ రూ.50 లక్షలకే సీఎస్కే అతడిని కొనుగోలు చేసింది. యువ ఆటగాళ్లకు తీసిపోని రీతిలో ఇవాళ రహానే బ్యాట్ ఝుళిపించిన తీరు సీఎస్కే అభిమానులను విశేషంగా అలరించింది. 

ఇక, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 40, శివమ్ దూబే 28 పరుగులు చేశారు. దీపక్ చహర్ బదులు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగిన అంబటి రాయుడు ముంబయికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించాడు. రాయుడు 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 1, పియూష్ చావ్లా 1, కుమార్ కార్తికేయ 1 వికెట్ తీశారు. 

టోర్నీలో చెన్నై ఇప్పటివరకు 3 మ్యాచ్ లాడి రెండు విజయాలు సాధించగా, ముంబయి ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది.


More Telugu News