'స్వాతంత్ర్యోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు' పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

  • స్వాతంత్ర్యోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు పుస్తకాన్ని రచించిన సంజయ్ కిశోర్
  • హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • చక్కని విశ్లేషణ అంటూ కొనియాడిన వెంకయ్యనాయుడు
  • ఇలాంటి పుస్తకాల అవసరం సమాజానికి చాలా ఉందని వెల్లడి
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాదులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంజయ్ కిశోర్ రచించిన స్వాతంత్ర్యోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖుల గురించి, నాటి పరిస్థితుల గురించి రచయిత సంజయ్ కిశోర్ ఈ పుస్తకంలో చక్కగా విశ్లేషించారని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్వాతంత్ర్యానికి ముందే ఉందని వెల్లడించారు. ఇలాంటి పుస్తకాల అవసరం సమాజానికి చాలా ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇటువంటి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావాలని రచయిత సంజయ్ కిశోర్ కు సూచించారు. 

ఈ కార్యక్రమంలో రచయిత సంజయ్ కిశోర్, మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి (పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షుడు), టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్ ఆసుపత్రుల అధినేత బొల్లినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

స్వాతంత్ర్యోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు పుస్తకం తొలి కాపీని శ్రీకర ఆర్గానిక్స్ అధినేత రాజు రూ.1,01,116 చెల్లించి కొనుగోలు చేశారు. 

కాగా, వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సభలు ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేవారని, కానీ ఇప్పుడు మూడు 'బి'లు ఉంటే గానీ జనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు 'బి'లు అంటే బస్సు, బిర్యానీ, బాటిల్ అని వివరించారు. ఈ మూడు ఏర్పాటు చేస్తే గానీ ప్రజలు సభలకు రావడంలేదని, దేశం ఇలా తయారైందేమిటన్న బాధ కలుగుతుందని వివరించారు.


More Telugu News