ప్రధానికి స్వాగతం పలకడానికి మహమూద్ అలీ, తలసాని వెళితే వాళ్లను పట్టించుకునేదెవరు?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ
  • ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్
  • కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళితే బాగుండేదన్న కోమటిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాగా, ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీని కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహమూద్ అలీ, తలసాని వెళితే అక్కడ వారిని పట్టించుకునేదెవరని ప్రశ్నించారు. 

ఎన్ని విభేదాలు ఉన్నా గానీ, సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికితే బాగుండేదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు మోదీ వెళితే మమతా బెనర్జీ, స్టాలిన్ స్వాగతం పలకడంలేదా? అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా అదే రీతిలో ఎయిర్ పోర్టుకు వెళ్లి మోదీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవాల్సిందని తెలిపారు. 

కేసీఆర్ కు ప్రధాని మోదీ 7 నిమిషాల సమయం కేటాయించారని, ఆ కొద్ది సమయంలో 70 సమస్యలు ప్రస్తావించవచ్చని పేర్కొన్నారు. సీఎం అడగకుండా కేంద్రం ఎలా నిధులు ఇస్తుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సీఎం రాష్ట్ర సమస్యలపై అడిగితే ఎవరైనా అడ్డుపడతారా? అని నిలదీశారు.


More Telugu News