డేటా ప్రాసెసింగ్ పై ఇస్రో ఉచిత కోర్సు... వివరాలు ఇవిగో!

  • ఐఐఆర్ఎస్ తో కలిసి కోర్సుకు రూపకల్పన చేసిన ఇస్రో
  • ఏప్రిల్ 10 నుంచి 14 వరకు కోర్సు
  • డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు
  • డేటా ప్రాసెసింగ్ పై కనీస పరిజ్ఞానం అవసరం
అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తున్న ఇస్రో తాజాగా డేటా ప్రాసెసింగ్ పై ఉచిత కోర్సును తీసుకువచ్చింది. డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) తో కలిసి ఈ సర్టిఫికెట్ కోర్సుకు రూపకల్పన చేసింది.

ఇది ఐదు రోజుల నిడివి కలిగిన స్వల్పకాలిక కోర్సు. ఏప్రిల్ 10 నుంచి 14వ తేదీ వరకు కోర్సు నిర్వహిస్తారు. దీనికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు ఆన్ లైన్ లో క్లాసు ఉంటుంది. సింథటిక్ అపెర్చర్ రాడార్ డేటా ప్రాసెసింగ్ పై ఈ కోర్సు ఉంటుంది. 

అర్హతల విషయానికొస్తే... డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ పై మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక విభాగాల్లో పనిచేసే సిబ్బంది, సైంటిఫిక్ సిబ్బంది, యూనివర్సిటీ, విద్యాసంస్థల పరిశోధకులు, ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావించే విద్యాసంస్థలు, వర్సిటీలు సొంత కోఆర్డినేటర్ ను నియమించుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు చేసుకునేందుకు https://elearning.iirs.gov.in/edusatregistration/ పోర్టల్ ను సందర్శించాలి. కోర్సులో చేరినవారికి 70 శాతం హాజరు ఉంటేనే సర్టిఫికెట్ ఇస్తారు.


More Telugu News