చెన్నై జట్టును ముంబై ఓడించి తీరుతుంది: యూసఫ్ పఠాన్

  • సొంత మైదానంలో ముంబైని ఒడించడం సులభం కాదన్న యూసఫ్ 
  • చారిత్రక విజయ గణాంకాలు కూడా ముంబైకి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడి
  • కీలక మ్యాచ్ ముందు చెన్నై జట్టుకు షాక్
ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న రెండు ఛాంపియన్ జట్ల మధ్య నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేటి రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుత సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి పోరు కానుంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ముంబై జట్టు ఐదు టైటిళ్లను నెగ్గగా, చెన్నై నాలుగు టైటిళ్లను సొంతం చేసుకోవడం తెలిసిందే.

ఈ రెండు జట్ల మధ్య చారిత్రక గణాంకాలను చూస్తే ముంబై జట్టే ఎక్కువ సార్లు విజయం సాధించింది. ముంబై జట్టు 21 సార్లు విజయాన్ని అందుకుంటే, ముంబైపై చెన్నై జట్టు 15 సార్లు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో ముంబై జట్టు ఏడు సార్లు చెన్నై జట్టుపై విజయం సాధించగా, మూడు సార్లు ఓడిపోయింది. ప్రముఖ మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ అయితే ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందన్న అంచనాతో ఉన్నాడు. ధోనీ మాత్రం అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు స్టార్ స్పోర్ట్స్ తో పేర్కొన్నాడు.

‘‘ముంబైలో అభిమానులు ఎప్పుడూ కూడా ధోనీ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటారు. కానీ, ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకుంటారు. ముంబై జట్టును సొంత గడ్డపై ఓడించడం కష్టం’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు చారిత్రక గణాంకాలను నిదర్శనంగా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ ను సొంత గడ్డపై ఓడించడం కష్టమని యూసఫ్ పఠాన్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ సైతం అభిప్రాయపడ్డాడు. ‘‘ముంబై, చెన్నై జట్ల మధ్య ఒకరిని విజేతగా ఎంపిక చేయడం కష్టమే. కానీ, ముంబై సొంత గడ్డపై ఆడుతోంది. కనుక గెలిచే అవకాశాలు వారికి ఎక్కువ’’అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇప్పటికే చెన్నై జట్టు ఒక విజయంతో రెండు పాయింట్లు గెలుచుకోగా, ముంబై జట్టు ఇంకా ఖాతా తెరవలేదు.

మరోవైపు కీలకమైన మ్యాచ్ ముందు చెన్నై జట్టుకు షాక్ తగిలింది. ప్రాక్టీస్ లో భాగంగా బెన్ స్టోక్స్ కాలి మడమ భాగంలో నొప్పి పట్టుకుంది. అతడికి పది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. కనుక ఈ మ్యాచ్ కు స్టోక్స్ ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. మినీ వేలంలో బెన్ స్టోక్స్ ను రూ.16.25 కోట్లు పెట్టి కొనుక్కున్నా, చెన్నై జట్టుకు కాలం కలసిరానట్టుంది.


More Telugu News