మద్యం మత్తులో గాల్లో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు

  • ఢిల్లీ–బెంగళూరు మధ్య ప్రయాణించిన ఇండిగో విమానంలో ఘటన
  • సిబ్బంది, పైలట్ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
  • ప్రయాణికుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
తప్పతాగి విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఫ్లైట్ గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ-బెంగళూరు మధ్య ప్రయాణించిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ప్రతీక్ అనే 40 ఏళ్ల ప్రయాణికుడిపై అధికారులు కేసు నమోదు చేసినట్టు విమానయాన సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం ఇండిగో 6ఈ 308 విమానంలో ప్రతీక్ ప్రయాణించాడు. ఢిల్లీ నుంచి విమానం బయల్దేరే ముందు ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎప్పట్లానే భద్రత నిబంధనల గురించి తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ గురించి కూడా స్పష్టమైన సూచనలు చేశారు. 

కానీ, సదరు ప్రయాణికుడు మద్యం మత్తులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్లాప్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన విమాన సిబ్బంది కెప్టెన్‌ను అప్రమత్తం చేశారు. పైలట్ ఆ ప్రయాణికుడిని హెచ్చరించాడు. విమానాన్ని సురక్షితంగా బెంగళూరులో దింపిన తర్వాత ప్రతీక్ ను సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ప్రయాణికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనధికారికంగా ట్యాంపరింగ్ చేశాడని అతనిపై కేసు పెట్టారు.


More Telugu News