ఐపీఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తాడనుకుంటే.. తుస్సుమనిపించేస్తున్న బ్రూక్!

  • వేలంలో రూ. 13.25 కోట్లకు బ్రూక్‌ను కొనుగోలు చేసిన హైదరాబాద్
  • రెండు మ్యాచుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన బ్రూక్
  • ఇదెక్కడి ఆటతీరంటూ అభిమానుల ట్రోల్స్
  •  మున్ముందు రాణిస్తాడంటున్న క్రీడా పండితులు
గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు హారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న బ్రూక్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోనూ తిరుగులేని ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఐపీఎల్‌లోనూ అతడు సంచలనాలు సృష్టించడం ఖాయమని భావించిన హైదరాబాద్ జట్టు అతడిపై ఏకంగా రూ. 13 కోట్లు కుమ్మరించి సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు బ్రూక్‌పై హైదరాబాద్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. 

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతడు విఫలమవడమే అందుకు కారణం.  గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ నాలుగు బంతులు మాత్రమే ఆడి మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు అతడిపై ట్రోల్స్ మొదలుపెట్టారు.

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో లాహోర్ కలండర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రూక్ 8 ఇన్నింగ్స్‌లలో 264 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. టెస్టు క్రికెట్‌లో 10 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో ఏకంగా 809 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని టీమిండియా పరుగుల వీరుడు విరాట్ కోహ్లీతో పోల్చేయడం మొదలెట్టేశారు. ఇప్పుడు రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమైన బ్రూక్‌పై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అయితే, మున్ముందు అతడు బ్యాట్ ఝళిపించడం ఖాయమని క్రీడా పండితులు చెబుతున్నారు.


More Telugu News