అబ్బో! ఆ ఒత్తిడిని భరించలేకపోతున్నా: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

  • శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం వీఐపీల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోందన్న ధర్మారెడ్డి
  • తన చేతిలో ఉండే 30 టికెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన
  • ఈ నెల 15 నుంచి జులై 15 వరకు సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్న ఈవో
  • మార్చిలో రూ. 120.29 కోట్ల హుండీ ఆదాయం లభించిందన్న ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం వీఐపీల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సెలవుల కారణంగా శుక్రవారం శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం దాదాపు 250 మంది వీఐపీలు జేఈవో కార్యాలయానికి దరఖాస్తు చేసినట్టు చెప్పారు. 160 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండగా అందులో 130 ముందుగానే బుక్ అవుతాయని, మిగిలిన 30 టికెట్లు తన చేతిలో ఉండడంతో వాటి కోసం వీఐపీలు ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆ ఒత్తిడిని భరించలేకపోతున్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ అభిషేకం టికెట్లు ఎక్కవగా ఇచ్చినా లోపల కూర్చునే పరిస్థితి కూడా ఉండదన్నారు. ఈ నెల 15 నుంచి జులై 15 వరకు సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అందులో భాగంగా వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ. 300 ఎస్ఈడీ టికెట్లను తగ్గించినట్టు తెలిపారు. తిరుమలలోని గోవర్థనం, సుదర్శన్, కల్యాణి, అతిథి గృహాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు టెండర్లు పిలుస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

విశాఖలోని శ్రీవారి ఆలయంలో త్వరలోనే ఆర్జిత సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, మార్చిలో తిరుమల వేంకటేశుడిని 20.57 లక్షలమంది దర్శించుకున్నారని, రూ. 120.29 కోట్ల హుండీ ఆదాయం లభించినట్టు తెలిపారు. అలాగే, 1.02 కోట్ల లడ్డూ ప్రసాదాలు విక్రయించామని, 38.17 లక్షలమంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించగా, 8.25 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు ధర్మారెడ్డి వివరించారు.


More Telugu News