పోసాని వైసీపీ వ్యక్తి... మరి ఆయనకు నంది ఎలా వచ్చింది?: నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్

  • నంది అవార్డులపై పోసాని వ్యాఖ్యల రగడ
  • టాలెంట్ చూసి అవార్డులు ఇస్తారన్న ప్రసన్నకుమార్
  • కమిటీలో కమ్మ ప్రాబల్యం అనేది పచ్చి అబద్ధమని వెల్లడి
నంది అవార్డుల విజేతల ఎంపికపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న పోసాని నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ స్పందించారు. 

చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభ ఆధారంగానే అవార్డులు ఇస్తారని, కులాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇవ్వరని స్పష్టం చేశారు. నంది అవార్డుల కమిటీకి జీవిత చైర్మన్ గా వ్యవహరించారని, గీతాంజలి, ప్రభ, భాగ్యలక్ష్మి, ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న చంద్రబోస్ అర్ధాంగి సుచిత్ర కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారని వివరించారు. 12 మంది సభ్యుల కమిటీలో ఆరు నుంచి ఏడుగురి వరకు మహిళల ప్రాతినిధ్యం ఉండేదని తెలిపారు. పోసాని చెప్పినట్టు 12 మందిలో 11 మంది కమ్మవాళ్లు అనేది పచ్చి అబద్ధం అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. 

"పోసాని వైసీపీ వ్యక్తి. మరి ఆయనకు గతంలో నంది అవార్డు ఎలా వచ్చింది? ఆయన ఆరోపణలే నిజం అయితే నాడు టీడీపీ వాళ్లే అవార్డులు పంచుకోవాలి కదా! ఆ సమయంలో పోసాని కులం, ప్రాంతం, పార్టీ చూడలేదు. టెంపర్ లో ఆయన క్యారెక్టర్ చూశారంతే. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆ సమయంలో రెండు సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఆయన నటన చూసి ఇచ్చారా లేక పార్టీ చూసి ఇచ్చారా... పోసానిని చెప్పమనండి! ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ దాకా వెళ్లింది. పోసాని తప్పుడు ఆరోపణలు చేస్తూ, అవే నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ప్రసన్నకుమార్ ధ్వజమెత్తారు.


More Telugu News