యూట్యూబ్ చానల్ సబ్ స్క్రిప్షన్ పేరుతో భారీ మోసం

  • కర్ణాటక మహిళకు రూ.8.20 లక్షల మేర టోకరా
  • వాట్సాప్ ద్వారా సంప్రదించిన సైబర్ నేరస్థులు
  • ఇంటి నుంచే పని ద్వారా ఆదాయం పొందొచ్చంటూ ఆఫర్
మొబైల్ యాప్ లో మూవీలను చూసి రేటింగ్ ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చంటూ గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళను సైబర్ నేరస్థులు రూ.76 లక్షలకు మోసగించిన ఘటన మరువక ముందే.. మరో భారీ మోసం వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళను యూట్యూబ్ చానల్ సబ్ స్క్రిప్షన్ పేరిట నేరస్థులు రూ.8 లక్షలకు మోసగించారు.

ఇంటి నుంచే పని చేసుకునే ఆఫర్ అంటూ ఆమెను మోసగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించి, ముగ్గులోకి లాగారు. పార్ట్ టైమ్ జాబ్ లో భాగంగా తాము చెప్పినట్టు యూట్యూబ్ చానళ్లను సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని కోరారు. తద్వారా కమీషన్ వస్తుందని చెప్పారు. ఇంటి నుంచే పని చేయడం ద్వారా ఆదాయం సంపాదించొచ్చంటూ వాట్సాప్ లో వచ్చిన సందేశానికి స్పందించడం వల్లే ఇదంతా జరిగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

తన పేరు యూస్ఫట్ అంటూ ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ఒక్కో యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకున్నందుకు రూ.50 ఇస్తామని చెప్పాడు. తర్వాత మరో వ్యక్తి సంప్రదించి ఆమె టెలిగ్రామ్ ఐడీ తీసుకున్నాడు. టెలిగ్రామ్ లో ఓ గ్రూపులో ఆమెను చేర్చారు. ఆ గ్రూపు ద్వారా కొన్ని టాస్క్ లు అప్పగించి అవి చేయాలని కోరారు. ఈ క్రమంలో తనకు వివిధ టాస్క్ ల పేరు చెప్పి రూ.8.20 లక్షలు లాగేశారంటూ బాధితురాలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఆన్ లైన్ లో, గుర్తు తెలియని నంబర్ల ద్వారా వాట్సాప్, మెయిల్స్ కు వచ్చే సందేశాలకు స్పందించకుండా ఉండడమే మంచిది.


More Telugu News