యాపిల్ దిగ్గజంగా ఉందంటే ఇందుకే..!

  • యూజర్ల ఫీడ్ బ్యాక్ తో యాపిల్ సీఈవో టిమ్ కుక్ మేల్కొలుపు
  • పొద్దున నిద్ర లేవగానే ఆయన చేసే మొదటి పని అదే
  • అవి చెప్పలేనంత ఆనందాన్నిస్తాయంటున్న యాపిల్ సారథి
ఒక రంగంలో దిగ్గజ సంస్థగా ఎదగడంతోనే విజయం సాధించినట్టు కాదు. ఆ స్థానంలో కొనసాగాలంటే, అంతకుమించిన కృషి అవసరం. స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, స్మార్ట్ ఫోన్ల దిగ్గజంగా యాపిల్ దశాబ్దంగా కొనసాగుతూనే ఉంది. దీని వెనుక యాపిల్ పరిశోధన, అభివృద్ధి విభాగం ఎప్పటికప్పుడు చేస్తున్న కృషి, టెక్నాలజీ ఆవిష్కరణలే సంస్థను అంత ఎత్తున నిలబెడుతున్నాయని అనుకోవచ్చు.

అయితే, అంత గొప్ప కంపెనీని నడిపిస్తున్న సారథి టిమ్ కుక్ (సీఈవో) ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు ఆయన నిద్ర లేస్తారు. లేచిన తర్వాత ఆయన చేసే మొదటి పని.. యాపిల్ ఉత్పత్తుల గురించి యూజర్లు పంపే మెయిల్స్, రివ్యూలు చూడడమే. ఈ విషయాన్ని టిమ్ కుక్ స్వయంగా వెల్లడించారు. పొద్దున్నే ఎందుకు చదువుతారు? అన్న ప్రశ్నకు.. కస్టమర్ల అభిప్రాయాలు తనకు కావాల్సినంత స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్నారు. ప్రజల జీవితాలపై యాపిల్ ఉత్పత్తుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న తర్వాత చెప్పలేనంత ఆనందం లభిస్తుందని టిమ్ కుక్ అంటున్నారు. 

ఇందుకు ఉదాహరణగా ఓ యూజర్ ఫీడ్ బ్యాక్ ను టిమ్ కుక్ షేర్ చేశారు. ఐఫోన్ 14 కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ రోజు కారులో వెళుతున్న సమయంలో.. కారు డ్రైవర్ స్పృహ తప్పిపోవడంతో అప్పుడు ఐఫోన్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడ్ని కాపాడిందట.  అత్యవసర శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఐఫోన్ 14లో ఉంది. మొబైల్ నెట్ వర్క్ లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఐఫోన్ 14 నుంచి కాల్ చేసుకోవచ్చు. 

కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులనూ టిమ్ కుక్ స్వాగతిస్తారు. ప్రతికూల అభిప్రాయాలు తమ విశ్వాసాన్ని తగ్గించలేవని, తమ యూజర్ల అభిరుచులను మరింతగా అర్థం చేసుకునేందుకు అవి మార్గం చూపిస్తాయన్నది టిమ్ కుక్ అభిప్రాయం. తమ యూజర్లు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి కోరుకుంటున్నారో తాము తెలుసుకోవాలన్నది ఆయన అభిమతం. అందుకే యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో అగ్రగామిగా ఉంటోంది. యూజర్ల అభిరుచులకు ప్రాధాన్యం ఇచ్చే ఏ కంపెనీ కూడా పోటీ నుంచి వెనక్కిపోదన్నది వాస్తవం.


More Telugu News